కరోనా సెకెండ్ వేవ్‌తో చాలా రాష్ట్రాల్లో బడులు మూతబడ్డాయి. సెకండ్ వేవ్ తో ఆంధ్రప్రదేశ్‌లో గత ఏప్రిల్ 20న మూతపడిన విద్యాసంస్థలు ఈరోజు నుంచి పునః ప్రారంభమయ్యాయి. విద్యార్థుల రాకతో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల వద్ద సందడి నెలకొంది. గత నెలలోనే ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలలు తెరుచుకున్నాయి. ఇప్పుడు పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలలు కూడా తెరుచుకున్నాయి. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ 1 నుంచి 10 తరగతులు, ఇంటర్ రెండో ఏడాది వారికి తరగతులు నిర్వహించనున్నారు. గదుల కొరత ఉన్న విద్యాసంస్థల్లో రెండు విడతలు క్లాసులు నిర్వహిస్తారు.
పాఠశాలల్లో మాస్కు, భౌతికదూరం, థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి చేశారు. మరోవైపు పాఠశాల విద్యలో నేటి నుంచి నూతన విద్యావిధానం అమలు చేయనున్నారు. పాఠశాల విద్యావ్యవస్థ ఆరు విభాగాలుగా మారనుంది. శాటిలైట్ ఫౌండేషన్‌కు బదులుగా పూర్వ ప్రాథమిక విద్య 1, 2.. ప్రీప్రైమరీ 1, 2 సహా ఒకటి, రెండు తరగతులు ఉంటే ఫౌండేషన్.. 1 నుంచి 5 తరగతులు ఉంటే ఫౌండేషన్ ప్లస్..3 నుంచి 8వ తరగతి వరకు ఉంటే ప్రీ హైస్కూళ్లు, 3 నుంచి 10వ తరగతి వరకు ఉంటే హైస్కూళ్లు, 3 నుంచి 12 వరకు ఉంటే హైస్కూల్ ప్లస్‌గా మార్చనున్నారు.