టోక్వో ఒలింపిక్స్ నీరజ్ చోప్రా జావిలిన్ త్రో లో 87.58 మీటర్లు విసిరి స్వర్ణపతకం సాధించి 135 కోట్ల మంది భారతీయులు ప్రపంచ యవనికపై తలెత్తుకొనేటట్లు ఔరా అని పించారు. ప్రపంచ ఒలింపిక్స్ అద్లెట్స్ లో భారత్ కు ఇది తొలి స్వర్ణం. ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో ఘనమైన ముగింపు ఇవ్వడంతో భారత అథ్లెట్ నీరజ్ చోప్రాను అందరూ తెగ పొగిడేస్తున్నారు. నీరజ్, భజరంగ్ లను సినీ ప్రముఖులు, క్రీడాభిమానులు, పొలిటికల్ లీడర్స్ అంతా సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.
ఏపీ సీఎం జగన్: అత్తుత్తమ ప్రదర్శన, అంతర్గత బలం కనబరచి.. దేశానికి పతకం సాధించావని భజరంగ్ పూనియాను జగన్ అభినందించారు. రెజ్లింగ్ 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో సెమీస్‌లో ఓడినప్పటికి కాంస్య పతక పోరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తన ప్రత్యర్థి కజకిస్తాన్‌కు చెందిన రెజ్లర్ దౌలత్ నియాజ్‌బెకోవ్‌కు కనీస అవకాశం ఇవ్వకుండా 8-0 తేడాతో చిత్తుగా ఓడించి.. భారత్‌కు ఆరో పతకాన్ని అందించాడు.
చంద్రబాబు నాయుడు: నీరజ్ చోప్రాను చూసి దేశం గర్విస్తోందని.. టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడని, ఒలింపిక్స్ చరిత్రలో భారత్ కు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో తొలి బంగారు పతకం అందించాడని అభినందించారు. కఠోర శ్రమ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన చోప్రా... తర్వాతి తరం అథ్లెట్లు కంచుకోటలు బద్దలు కొట్టేలా స్ఫూర్తినందిస్తాడని పేర్కొన్నారు.
నారా లోకేశ్: చారిత్రక విజయం సాధించిన చోప్రాకు వేనవేల అభినందనలు అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. భారతీయులందరూ ఇది గర్వపడే రోజు అని పేర్కొన్నారు. టాలీవుడ్ ప్రముఖులు సైతం నీరజ్ చోప్రా మహోన్నోత ప్రదర్శన పట్ల ముగ్ధులయ్యారు. భారత్ కు ఇది నిజంగా ఘనమైన తరుణం అని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. అథ్లెటిక్స్ లో భారత్ కు ఒలింపిక్ స్వర్ణం... ఈ క్షణం కోసం 101 ఏళ్లు పట్టాయని వివరించారు. నీరజ్ చోప్రా... నీకు శిరసు వంచి నమస్కరిస్తున్నా. నువ్వు చరిత్ర సృష్టించడమే కాదు, చరిత్ర గతినే మార్చేశావు అంటూ కితాబిచ్చారు.
సూపర్ స్టార్ మహేశ్ ట్వీట్ చేస్తూ.. నీరజ్ చోప్రా పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని పేర్కొన్నారు. భళా అంటూ అభినందించారు. భారత్ కు ఒలింపిక్స్ అథ్లెటిక్స్ ఈవెంట్లలో లభించిన తొలి స్వర్ణం ఇదని కొనియాడారు. సంతోషంగా ఉప్పొంగిపోవడమే కాదు, గర్విస్తున్నామని తెలిపారు.