జులై 23 న తెలంగాణలో 100 సీట్ల సామర్ధ్యంతో థియేటర్స్ తెరుచుకున్నాయి. కానీ జులై 30 నుండి సినిమా సందడి థియేటర్స్ దగ్గర మొదలయ్యింది. ముందుగా సత్యదేవ్ తిమ్మరుసు, తేజ సజ్జ ఇష్క్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. అయితే సినిమాల టాక్ ఎలా ఉన్నా.. థియేటర్స్ లో ప్రేక్షకుల సందడి జోరు అంతగా కనిపించలేదు. సో సో గానే తిమ్మరుసు, ఇష్క్ కలెక్షన్స్ కనిపించాయి. ఇక నేడు శుక్రవారం పొలోమంటూ ఆరేడు సినెమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. ఓటిటి అడిగినా అమ్మని చిన్న చితక సినిమాలన్నీ నేడు థియేటర్స్ కి క్యూ కట్టాయి.
అందులో కిరణ్ అబ్బవరం - సాయి కుమార్ ల SR కల్యాణమండపం తప్ప మిగతావన్నీ ఊరుపేరు లేని సినిమాలే. మెరిసే మెరిసే, శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు మొనగాళ్లు, ఇప్పుడు కాక ఇంకెప్పుడు, SR కల్యాణమండపం, క్షీరసాగర మధనం.. ఇలా చిన్నా చితక అన్ని థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి కానీ.. థియేటర్స్ లో ప్రేక్షకుల సందడి మాత్రం కనిపించడం లేదు. తెలంగాణాలో 100 శాతం సీటింగ్, ఆంధ్రాలో 50 శాతం సీటింగ్స్ తో థియేటర్స్ నడుస్తున్నా.. సినిమాల హడావిడి ఉన్నా.. ప్రేక్షకులు సందడి నిల్ అనేలా ఉంది. మార్నింగ్ షోస్ కి బాక్సాఫీసు దగ్గర పెద్దగా సందడి కానరాలేదు.. మరి అక్కడక్కడా ప్రేక్షకులు పల్చగా థియేటర్స్ లో కనిపిస్తున్నారు తప్ప ఇంట్రెస్ట్ గా సినిమాకి వచ్చినవారు లేరు.
అందులోను ఏపీలో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది అన్న టాక్ ఉంది. అక్కడ చాలా చోట్ల అంటే గుంటూరు, చిత్తూరు లాంటి ఏరియాస్ లో అప్పుడే లాక్ డౌన్ అంటున్నారు. మరి ఇలాంటి టైం లో ప్రేక్షకులు ఏ ధైర్యంతో థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూస్తారు.. అనేది ఇప్పుడు మేకర్స్ ముందున్న ప్రశ్న.