టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో తెలుగుతేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన సంగతి తెలిసిందే. నేడు మంగళవారం స్వదేశానికి చేరుకున్న సింధు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టగానే అక్కడ ఘన స్వాగతం లభించింది. ఇక తర్వాత సింధును కేంద్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. సింధు కాంస్యం సాధించడంలో ముఖ్యపాత్ర పోషించిన ఆమె కోచ్ పార్క్ తై సేంగ్‌ను కూడా ఘనంగా సత్కరించింది.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, నిర్మలా సీతారామన్, కిషన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పీవీ సింధుకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అనంతరం ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకొని వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ ఈ ఘట్టాన్ని ఆవిష్కరించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా సింధు చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు అభిమానులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు.