టోక్యో ఒలింపిక్స్ లో భారత్ రెండో పతకం సాధించి రికార్డు సృష్టించింది తెలుగు తేజం పివి సింధు. మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ లో రజతం సాధించగా, పీవీ సింధు బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో కాంస్యం నెగ్గింది. అంతేకాదు, ఈ పతకం ద్వారా సింధు చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. 2016 రియో ఒలింపిక్స్ లో రజతం నెగ్గిన సింధు, ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది. పివి సింధు దేశానికీ కాంస్య పథకం అందించడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్, ఇంకా సినిమా సెలబ్రిటీస్ మహేష్ బాబు, చిరంజీవి తదితరులు సింధుకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ: సింధు తిరుగులేని ప్రదర్శనతో అందరం సంతోషిస్తున్నామని తెలిపారు. సింధు భారత్ కు గర్వకారణమని, దేశం నుంచి ఉద్భవించిన అతికొద్దిమంది అద్భుతమైన ఒలింపియన్లలో సింధు కూడా ఒకరని మోదీ పివి సింధుని మెచ్చుకున్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు: సింధు చరిత్ర సృష్టించిందని, ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్ సింధు మాత్రమేనని వెల్లడించారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు: మన ఏస్ షట్లర్ మరోసారి గర్వపడేలా చేసిందని తెలిపారు. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించినందుకు శుభాభినందనలు అని తన ట్వీట్ లో పేర్కొన్నారు.
సీఎం జగన్: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సింధును సీఎం జగన్ అభినందించారు. భవిష్యత్ ఈవెంట్స్‌లోనూ సింధు విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
ఏపీ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్: సింధు విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
మెగాస్టార్ చిరంజీవి: వరుసగా రెండు సార్లు ఒలింపిక్ పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన @pvsindhu1 కి నా అభినందనలు. ఇంతవరకు ఇండియా గెలిచిన రెండు పతకాలు మన ఆడబిడ్డలే గెలవటం మన దేశంలోని స్త్రీ శక్తికి నిదర్శనం.
పవన్ కళ్యాణ్: టోక్యో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్యం గెలుచుకొని మన దేశానికి మరో పతకాన్ని అందించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధుకి నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. టోక్యోలో మన దేశ పతాకం మరోమారు రెపరెపలాడేలా చేసిన సింధుని చూసి దేశమంతా గర్విస్తోంది. అప్పుడు రియోలోనూ, ఇప్పుడు టోక్యోలోనూ… వరుసగా రెండు ఒలింపిక్స్ పోటీల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారిణిగా సింధు సాధించిన రికార్డుతో క్రీడాభిమానులు మురిసిపోతున్నారు.
మహేష్ బాబు: పివి సింధు మరో చారిత్రాత్మక విజయం సాధించింది .. భారతదేశం యొక్క అత్యుత్తమ క్రీడాకారిణి!! కాంస్యం గెలిచినందుకు అభినందనలు
అంటూ పలువురు సినీ ప్రముఖులు, పొలిటిషన్స్ పివి సింధు కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.