ఏపీలో కరోనా కేసులు మళ్ళీ పెరగడం కలవరం సృష్టిస్తుంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. అందుకే ఏపీ ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా నిబంధనల్ని మరింత కఠినతరం చెయ్యాలని నిర్ణయించింది. మాస్క్ లేకుండా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేసింది. కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లోకి మాస్క్లు లేని వారిని అనుమతిస్తే 10 వేల నుండి 25 వేల వరకు జరిమానా విధిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు.
అంతేకాకుండా మాస్క్ లేకుండా ఉన్నవారికి 2-3 రోజుల పాటు సంబంధిత సంస్థల్ని మూసివేసేలా అధికారులు చర్యలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు వారాల పాటు రాత్రి వేళ కర్ఫ్యూను పొడిగించినట్లు తెలిపారు. ఆగస్టు 14 వరకూ కర్ఫ్యూ ఆంక్షలు ప్రతి రోజూ రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అమలులో వుంటాయన్నారు.