దేవినేని ఉమా అరెస్ట్ నేపథ్యంలో నేడు మీడియా సమావేశం నిర్వహించిన టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు.. వైసీపీ నేతలే టీడీపీ నేతలపై దాడులు చేసి రివర్స్ కేసులు పెట్టారని మండిపడ్డారు. కొండపల్లి బొమ్మలు తయారు చేసే చోట చెట్లను నరికేస్తున్నారన్నారు. పర్యావరణం దెబ్బతింటుందని ఉమాతో పాటు టీడీపీ నేతలు అక్కడికి వెళ్లారని చెప్పారు. ఉమాపైన హత్యాయత్నం కేసు పెట్టడానికి ప్రభుత్వానికి సిగ్గుందా అని నిలదీశారు. తర్వాత విజయవాడలోని గొల్లపూడిలో దేవినేని కుటుంబసభ్యులను చంద్రబాబు పరామర్శించారు.
ఉమా అరెస్ట్ విషయంలో దేవినేని కుటుంబసభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. జరిగిన ఘటన మొత్తాన్ని ప్రజలంతా గమనించారు. అక్రమ మైనింగ్ జరగకపోతే నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారు? పోలీసులు దారి మళ్లించి దాడి జరిగే ప్రాంతం వైపు ఉమను వెళ్లేలా చేశారు. ఈ దాడులకు తెదేపా భయపడదు. తెదేపాతో పెట్టుకున్నవారు కాలగర్భంలో కలిసిపోయారు అని చంద్రబాబు అన్నారు.