రెండేళ్లుగా అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడుతోంది అంటూ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. వైసీపీ నేతల అక్రమాలను ప్రశ్నించిన వారిపై అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ చేస్తున్న అక్రమ మైనింగ్‌ను దేవినేని ఉమా ప్రశ్నించడం తప్పా.. అంటూ ఆమె నిలదీశారు. ఉమా పై దాడి చేసిన వైసీపీ గూండాలను వదిలేసి రివర్స్‌లో దేవినేని ఉమాపై కేసు పెట్టడమేంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా దళితుల అసైన్డ్ భూములు లాక్కున్నారని ప్రశ్నించిన మహాసేన రాజేష్‌ను జైల్లో పెట్టారన్నారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించిన మాజీ ఎంపీ హర్ష కుమార్‌ను జైలు పాలుచేశారని అన్నారు. మాస్కులు అడిగిన దళిత డాక్టర్ సుధాకర్‌ను వేధించి చంపేశారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో దళిత ఆడబిడ్డలకు రక్షణ కరువైందని అనిత ఆగ్రహం వ్యక్తం చేసారు.