వరుస ప్లాప్‌ల తర్వాత ‘గబ్బర్‌సింగ్’ హిట్టు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కి.. ఆయన అభిమానులకి ఎటువంటి బూస్ట్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని రూపొందించిన తీరు మెగాభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఖాకీ డ్రస్‌లో పవన్ కల్యాణ్ కనిపించిన తీరు, పలికిన డైలాగులు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. మరి అదే ఖాకీ డ్రస్సులో, అలాంటి పవర్ ఫుల్ డైలాగులతో మరోసారి పవన్ కల్యాణ్ వస్తున్నాడంటే ఫ్యాన్స్‌కి పూనకాలు ఖాయం. అలాంటి కిక్కే ఇవ్వబోతోంది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్.
సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ చిత్రం మళ్లీ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా చిత్రయూనిట్ ఓ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ వీడియోలో పవన్ కల్యాణ్‌ను చూసిన వారంతా.. ‘గబ్బర్‌సింగ్’ను చూసినట్లే ఉందని కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే-డైలాగ్స్ అందిస్తుండటంతో.. మెగా ఫ్యాన్స్ అంతా మరో మెమరబుల్ చిత్రం పవర్‌స్టార్‌కు రాబోతుందనేలా సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.