గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘మా’ ఎన్నికలపై ఎటువంటి చర్చలు నడుస్తున్నాయో తెలియంది కాదు. సెప్టెంబర్‌లో జరగనున్న ‘మా’ ఎన్నికల బరిలో అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే 5గురు బరిలోకి దిగారు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్, జీవితా రాజశేఖర్, హేమ, సివిఎల్ నరసింహారావు ఈసారి ‘మా’ అధ్యక్ష బరిలో ఉన్నారు. అయితే ‘మా’ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రాకుండానే.. వీరు మేమంటే మేము అని ప్రకటనలు ఇచ్చుకోవడంపై సీనియర్ నటీనటులు ఫైర్ అయిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పటి వరకు ‘మా’కు సంబంధించి అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవంగానే ఎక్కువ సార్లు జరిగింది. ఈసారి 5గురు బరిలో ఉన్నప్పటికీ.. పెద్దలు ఏకగ్రీవం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు.
రెండు, మూడు దఫాలుగా ‘మా’ ఎన్నికల విషయంలో ‘మా’ పరువు మీడియా బారిన పడుతుండటం, ఈసారి ఎన్నికలు జరిగితే అది మరింతగా దిగజారుతుందని భావించిన కృష్ణంరాజు, మురళీ మోహన్ వంటివారితో పాటు మరికొందరు పెద్దలు ఏకగ్రీవానికే మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. ఇంకా ఎన్నికల గురించి ఎటువంటి ప్రకటన రాకుండానే.. ‘అది చేస్తా.. ఇది చేస్తా.. పేర్లు బయటపెడతా..’ వంటి బెదిరింపులతో పాటు రాజకీయ పార్టీల కోణం కూడా ఉందనేలా వార్తలు వినబడుతుండటంతో.. ఈసారి ఎన్నికలు జరిగితే.. పెద్ద పెద్ద గొడవలు, దూషించుకోవటాలు ఉంటాయని భావించే వారీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, ఈసారి ఎవరిని అధ్యక్షునిగా చేయాలో కూడా వారు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా టాక్. ఇంతకు ముందు ‘మా’ ఎన్నికలలో సీనియర్ నటుడికి పోటీగా నిలబడి ఓడిపోయిన సీనియర్ నటికి ‘మా’ పగ్గాలు ఇవ్వాలనే నిర్ణయం దాదాపు ఖరారైందనేలా వార్తలు వినబడుతున్నాయి. మరి నిజంగా ఇది నిజమైతే మాత్రం.. ‘మా’ పెద్దలు చక్కని నిర్ణయం తీసుకున్నట్లే. ‘మా’ పరువును కాపాడుకున్నట్లే.