ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసి, అభినయ శారదగా పేరు తెచ్చుకున్న నటి జయంతి. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 500లకు పైగా సినిమాలు చేశారు. ఆమె మృతి పట్ల నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
నందమూరి బాలకృష్ణగారు మాట్లాడుతూ జయంతిగారు గొప్ప నటి. అప్పటినుంచి ఇప్పటివరకూ అనేక తరాలతో కలిసి పనిచేసిన సీనియర్ నటీమణి. నాన్నగారి జగదేకవీరుని కథ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై, తర్వాత కుల గౌరవం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి వంటి అజరామరమైన చిత్రాల్లో కలిసి నటించారు. నేను హీరోగా నటించిన అల్లరి క్రిష్ణయ్య, ముద్దుల మేనల్లుడు, తల్లితండ్రులు, వంశానికొక్కడు చిత్రాల్లో మంచి పాత్రలు పోషించారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా సినిమాలు చేశారు. ప్రేక్షకులు అందరి మన్ననలు అందుకున్నారు. ఆమె మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు పెద్ద లోటుగా భావిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆత్మ స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.