గత ఏడాది షూటింగ్ స్పాట్ లో ఉన్న విజయ్ ని ఓ సినిమా పారితోషకం విషయంలో ఐటి అధికారులు ప్రశ్నించడానికి వచ్చినప్పుడు ఆ విషయం పెద్ద సెన్సేషన్ అయ్యింది. స్టార్ హీరో అయ్యుండి ఇలా పన్నులు ఎగ్గొట్టడం ఏమిటి అంటూ అప్పట్లో విజయ్ మీద చాలా ట్రోల్స్ నడిచాయి. తాజాగా విజయ్ ఇలా పన్ను ఎగ్గొట్టిన విషయంలో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కొన్నేళ్ల క్రితం ఇంగ్లండ్ నుంచి రోల్స్ రాయిస్ కారు దిగుమతి చేసుకున్న హీరో విజయ్.. దానికి పన్ను చెల్లించకపోవడంతో.. ఐటి శాఖ అసిస్టెంట్ కమిషనర్ లగ్జరీ రోల్స్ రాయిస్ కారుపై ఎంట్రీ టాక్స్ చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఐటి శాఖ సవాలు చేస్తూ, పన్నుకు వ్యతిరేకంగా నిషేధాన్ని కోరుతూ హీరో విజయ్ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే హీరో విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. విదేశాల నుండి దిగుమతి చేసుకున్న లగ్జరీ రోల్స్ రాయిస్ కారుకి ఇంతవరకు ట్యాక్స్ పే చేయనందుకు విజయ్‌కు మద్రాస్ హైకోర్టు జరిమానా విధించింది. రీల్ హీరోలు పన్ను కట్టేందుకు వెనకాడుతున్నారని వ్యాఖ్యానించిన మద్రాస్ హైకోర్టు.. తమిళనాడులోని నటులు నిజమైన హీరోలుగా ఉండాలి.. అంతేకాని రీల్ హీరోలుగా కాదని న్యాయమూర్తి సలహా ఇచ్చారు. అలాగే నటులు కట్టే పన్నులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, సెలబ్రిటీస్ సకాలంలో పన్నులు చెల్లిస్తే.. మిగతా ప్రజలు కూడా వారి దారిలో నడుస్తారని.. హీరో విజయ్ కి మద్రాస్ హైకోర్టు సున్నితంగా వార్నింగ్ ఇచ్చింది.