కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గినా ఇప్పడు థర్డ్ వేవ్ భయం మొదలైంది. థర్డ్ వేవ్ ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు చాలా రాష్ట్రాలు సన్నద్ధంగా ఉన్నాయంటూ లాక్ డౌన్ ఎత్తివేస్తున్నాయి. కానీ ఝార్ఖండ్ ప్రభుత్వం మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 22న ఆ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కు సంబంధించి కఠిన నిబంధనలను ప్రారంభించింది. లాక్ డౌన్ విధించింది. అప్పటి నుంచి వరుసగా ఏడు సార్లు లాక్ డౌన్ ను పొడిగించింది. తాజా లాక్ డౌన్ ఈరోజుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను అనుమతించబోమని ఝార్ఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అంతర్రాష్ట్ర ప్రయాణాలకు సంబంధించి ఈ-పాస్ ఉండాలని సూచించింది. అధికారుల వాహనాలకు ఎలాంటి ఆటంకాలు ఉండవని తెలిపింది. ప్రార్థనా స్థలాలన్నీ మూసి ఉంచాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ భేటీ అయింది. ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా హేమంత్ సొరేన్ మాట్లాడుతూ, ప్రజారోగ్యం కోసం లాక్ డౌన్ ను మరో వారం పాటు పొడిగిస్తున్నామని చెప్పారు. ప్రమాదకర పరిస్థితుల నుంచి రాష్ట్రం ఇంకా బయటపడలేదని.. కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని అన్నారు.