గత ఏడాది కరోనా లాక్ డౌన్ తో చాలా నెలల పాటు థియేటర్స్ బంద్ అవడం, సినిమా షూటింగ్స్ ఆగిపోవడం జరిగింది. అయితే థియేటర్స్ ఓపెన్ చేసాక ఓ నెల రోజుల పాటు ప్రేక్షకుల స్పందన చూసాక.. టాలీవుడ్ దర్శకనిర్మాతలు థియేటర్స్ లో బొమ్మ వేసేందుకు రెడీ అయ్యారు. ఒకరు మీద ఒకరు పోటీ పడుతూ జనవరి 26 నుండి ఫిబ్రవరి పది లోపు టాలీవుడ్ లో తెరక్కెడుతున్న భారీ, చిన్న, మీడియం సినిమాల రిలీజ్ డేట్స్ తో సోషల్ మీడియా ని మోత మోగించారు. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ ప్రకటించింది మొదలు.. అల్లు అర్జున్ పుష్ప డేట్ ఇచ్చేసి షాకిచ్చాడు. ఇక తర్వాత ఆచార్య, నారప్ప, బాలయ్య అఖండ, రవితేజ ఖిలాడీ, లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాట పర్వం, ఎఫ్ 3, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, లైగర్, వరుణ్ తేజ్ గని, ప్రభాస్ రాధేశ్యామ్, ఇలా వరసగా రిలీజ్ డేట్స్ తో మోత మోగించారు.
మళ్ళీ సెకండ్ వేవ్ తగిలింది. రిలీజ్ డేట్స్ అన్ని చెల్లాచెదురు అయ్యాయి. ఏప్రిల్, మే లో విడుదల కావల్సిన సినిమాలు ఆగిపోయాయి. షూటింగ్స్ కి బ్రేకులు పడడంతో.. జూన్, జులై, ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్ లో రిలీజ్ డేట్స్ ఇచ్చిన సినిమాల డేట్స్ కూడా ఇప్పుడు డోలాయమానంలో పడ్డాయి. అయితే తాజాగా సెకండ్ వేవ్ ముగిసి.. థియేటర్స్ ఓపెన్ అవుతున్న తరుణంలో మరోసారి సినిమా రిలీజ్ డేట్స్ జాతర మొదలు కాబోతుంది అనిపిస్తుంది. ఏప్రిల్, మే సినిమాలన్నీ ఆగష్టు లో థియేటర్స్ లో దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగష్టు లో వరస సినిమాలతో థియేటర్స్ బాక్సాఫీసు గలగలలు, ప్రేక్షకుల కళకళలు కనిపించేలా ఉంది. చూద్దాం ఆ మోత ఎప్పుడు మొదలు పెడతారో అనేది.