భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. మూడు నెలల తర్వాత కొత్త కరోనా కేసులు 43 వేల కంటే తక్కువగా నమోదయ్యాయి. పలు రాష్ట్రాల్లో 100 ల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్, కర్ఫ్యూ సడలింపులు ఇచ్చినా కరోనా కేసులు కంట్రోల్ లో ఉన్నాయి. ఇక దేశంలో నిన్న 42,640 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దాని ప్రకారం.. నిన్న 81,839 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,77,861కు చేరింది.
కరోనా మరణాలు కూడా తక్కువగానే నమోదవుతున్నాయి. నిన్న1,167 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,89,302కు పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,89,26,038 మంది కోలుకున్నారు. 6,62,521 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. వ్యాక్సినేషన్ కు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 28,87,66,201 డోసులు ఇచ్చారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 39,40,72,142 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 16,64,360 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.