సెకండ్ వేవ్ నుండి ఇండియా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. లాక్ డౌన్, కర్ఫ్యూలతో దేశంలో కరోనా కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి. సోమవారం 17,51,358 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 60,471 మందికి పాజిటివ్‌గా తేలింది. గత కొద్ది రోజులుగా లక్ష దిగువనే నమోదవుతోన్న కరోనా కేసులు..నిన్న మార్చి 31 తో పోలిస్తే చాలా తగ్గాయి. గత కొద్ది రోజులుగా పలు రాష్ట్రాలు మరణాల లెక్కను సవరిస్తుండటంతో వాటి సంఖ్యలో పెరుగుదల కనిపించింది. అయితే నిన్న మూడువేల దిగువనే మరణాలు నమోదవడం కూడా కాస్త ఊరట కలిగించే అంశం.
గత 24 గంటల వ్యవధిలో 2,726 మంది కరోనా కారణంగా ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసులు 2.9కోట్లకు పైన ఉండగా 3.7లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 38కోట్లకుపైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 9,12,378 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. ఆ రేటు 3.30 శాతానికి తగ్గింది. నిన్న ఒక్కరోజే 1,17,525 మంది కోలుకోగా.. రికవరీ రేటు 95.43 శాతానికి పెరిగింది. మొత్తంగా 2.82కోట్ల మందికిపైగా వైరస్ నుంచి కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. మరోపక్క ఇండియా లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతుంది. నిన్న ఒక్కరోజే 39,27,154 మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. నిన్నటి వరకూ 25.90 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయినట్లు కేంద్రం వెల్లడించింది.