కరోనా సెకండ్ ఉధృతి ఓ కొలిక్కి వచ్చినా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉండడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు థర్డ్ వేవ్ ని ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీలో కర్ఫ్యూ జూన్ 20 వరకు పొడిగించారు. అలాగే తెలంగాణాలో 12 గంటల లాక్ డౌన్ జూన్ 20 వరకు అమలు చేస్తున్నట్టుగా ప్రకటించారు. సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఉధృతిలో విద్యార్థుల ఆరోగ్యం దృష్యా చాలా రాష్ట్రాల్లో పరీక్షల రద్దు కొనసాగుతుంది. ఇప్పటికే తెలంగాణాలో పది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు చేసారు.
ఇక తాజాగా తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో కేసీఆర్ పలువురు మంత్రులతో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలపై కూడా చర్చించారు. దేశం మొత్తం మీద సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలు రద్దు అయ్యాయని.. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయని మంత్రులు కేసీఆర్ మీటింగ్ లో చర్చించారు.. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ సరికాదని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఇక సీఎం కేసీఆర్ మంత్రుల నిర్ణయం మేరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ ఎగ్జామ్స్ రద్దుతో పాటు, వాటి ఫలితాల విధానాలపై ఈ రోజు సాయంత్రం అధికారికంగా ప్రభుత్వం ప్రకటించనుంది.