ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత ఎంపీ నవనీత్ కౌర్ కి బాంబే హై కోర్టు షాకిచ్చింది. 2014 లో మహారాష్ట్ర నుండి పోటీ చేసి ఓడిపోయిన నవనీత్ కౌర్.. తర్వాత మహారాష్ట్రలోని అమరావతి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచింది. ఒక్కపుడు సినిమాల్లో నటించినా రాజకీయాల్లోకి వెళ్ళాక నవనీత్ సినిమాలని పూర్తిగా పక్కనపెట్టేసింది. అయితే రాజకీయాల్లో నవనీత్ కౌర్ ఎస్సీ అంటూ తప్పుడు పత్రాలు సమర్పించి గెలిచారని శివసేన నేత ఆనంద్ రావ్ అడ్సల్ పిటిషన్ దాఖలు చేశారు. నవనీత్ పై వచ్చిన ఆరోపణపై బాంబే హై కోర్టు విచారణ చేపట్టింది.
కోర్టు విచారణలో ఆమె ఎస్సీ కాదని కోర్టు తేల్చింది. ఆమె ఎస్సీ కాదంటూ.. నవనీత్ కుల ధ్రువ పత్రం తప్పు అని బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నవనీత్ కౌర్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. దానితో పాటుగా నవనీత్ కౌర్ కి 2 లక్షల జరిమానా కూడా కట్టమని తీర్పునిచ్చింది. నవనీత్ కౌర్ కుల ధ్రువీకరణ రద్దు నేపథ్యంలో ఆమె తన ఎంపీ పదవిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. తప్పుడు కులపత్రంతో పార్లమెంట్ లోకి నవనీత్ కౌర్ అడుగుపెట్టే అర్హతని కోల్పోయినట్లుగా చెబుతున్నారు.