జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ పై ఎప్పటినుండో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శ్రీదేవి టాలీవుడ్ డ్రీం గర్ల్. అదే తల్లి కూతురు బాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తుంది. ఆ క్రేజ్ తో తెలుగులోకి స్టార్ హీరోల సినిమాలతో ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ చాలా ఏళ్లగా ప్రచారం జరుగుతుంది. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ దగ్గరనుండి ఇప్పుడు మహేష్ - త్రివిక్రమ్ సినిమా వరకు జాన్వీ కపూర్ పేరు టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిపి వినిపిస్తుంది. అందులో తప్పు లేదు. కానీ జాన్వీ కపూర్ ఆలోచన వేరేలా ఉందట.
ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వీ కపూర్.. అక్కడ బ్లాక్ బస్టర్ కొట్టింది లేదు. స్టార్ హీరో ఆఫర్ పట్టింది లేదు. అయితే అక్కడ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకున్నాకే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలన్నది జాన్వీ కపూర్ ఆలోచనట. అందుకే తెలుగు నుండి బడా ఆఫర్స్ వస్తున్నప్పటికీ జాన్వీ కపూర్ లైట్ తీసుకుంటుంది అంటున్నారు. బాలీవుడ్ లో చిన్న సినిమాల నుండి భారీ బడ్జెట్ మూవీస్ లో నటించి పేరు తెచ్చుకున్నాకే టాలీవుడ్ ఆఫర్స్ మీద ఆలోచించాలని జాన్వీ అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అంటే అప్పటివరకు టాలీవుడ్ కి జాన్వీ దర్శనం ఉండనట్లే.