కరోనా కల్లోలంతో దేశ ప్రజలంతా ఆక్సిజెన్ కోసం అల్లాడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ వాసులు కరోనా మహమ్మారితో గజగజ వణికిపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ తప్ప మరేది కరోనా కట్టడి చెయ్యలేదని.. అందరూ లాక్ డౌన్ కే మొగ్గు చూపుతున్నారు. కర్ణాటక, కేరళ, మద్యప్రదేశ, గోవా ఇలా చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ పెట్టగా.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి తమిళనాడు ప్రభుత్వం కూడా చేరింది. ఇప్పటివరకు నైట్ కర్ఫ్యూ, రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆంక్షలు విధించిన తమిళనాడు ప్రభుత్వం కూడా లాక్ డౌన్ కి జై కొట్టింది.
ఈ నెల 10 నుండి రెండు వారాలపాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్టు ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. కరోనా కట్ఠడి కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోవడంతో తమిళనాడులో కొత్తగా ఏర్పాటైన స్టాలిన్ ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తున్నట్లుగా ప్రకటించింది. లాక్‌డౌన్ కాలంలో కిరాణ దుకాణాలను మధ్యాహ్నం 12 గంటల వరకు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. రెస్టారెంట్లకు కూడా కేవలం పార్సిల్స్ కి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇక 12 తర్వాత దుకాణాలను కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్సులు, థియేటర్లు, జిమ్‌లు, బార్లు మూసివేయాలని పేర్కొంది.