దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కట్టడి చెయ్యలేక లాక్ డౌన్ శరణ్యమనుకుని చాలా రాష్ట్రాలు కేంద్రం తో సంబందం లేకుండా తమ రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తున్నాయి. యూపీ, మధ్య ప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, ఒడిశా అలాగే కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు అమలవుతున్నాయి. తెలంగాణాలో నైట్ కర్ఫ్యూ అమలవుతుంటే.. ఏపీలో మధ్యాన్నం 12 నుండి ఉదయం ఆరు గంటల వరకు అంటే 18 గంటల కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. నేటి నుండి ఏపీలో ఈ తరహా ఆంక్షలు అమలవుతున్నాయి. అయితే తెలంగాణ లో కూడా నైట్ కర్ఫ్యూ టైమింగ్స్ పెంచాలని వీకెండ్ లాక్ డౌన్స్ విధించాలని హై కోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
కానీ తెలంగాణాలో లాక్ డౌన్ విధించే అంత ఘోరమైన పరిస్థితులు లేవని, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ సేఫ్ గానే ఉంది అని, కాకపోతే వారాంతపు లాక్‌డౌన్ విషయం గురించి మాత్రం ఆలోచిస్తున్నట్టుగా తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కరోనా కట్టడికి ఎన్ని కోట్లయినా.. కరోనా పేషేంట్స్ కి మంచి చికిత్స అందించడానికి వెనుకాడొద్దు అని సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా ఆయన చెబుతున్నారు. లాక్‌డౌన్ విధించి ప్రజలను ఇబ్బంది పెట్టడం కంటే.. కరోనా వచ్చిన వారికి మంచి చికిత్స అందించడం ఎంతో ముఖ్యమన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా అదుపులో ఉంది అని, త్వరలోనే తెలంగాణాలో సాధారణ పరిస్థితులు వస్తాయని అన్నారు. చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ పెట్టడంపై సోమేశ్ కుమార్ స్పందిస్తూ.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న తీవ్రమైన పరిస్థితి కారణంగానే ఆ రాష్ట్రాలు లాక్ డౌన్ పెట్టాయని, లాక్ డౌన్ వలన ప్రజలు జీవనోపాధి కోల్పోతారని, లాక్ డౌన్ అవసరమనుకుంటే.. కేసీఆర్ తగిన నిర్ణయం తీసుకుంటారంటూ ముగించారు.