కమల్ హాసన్ సినిమాల్లో లోకనాయకుడు.. ఆయన నటనకు ఎవరు సాటి రారు.. కానీ కమల్ హాసన్ కొన్నాళ్లుగా తమిళ పాలిటిక్స్ లో బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఓ పొలిటికల్ పార్టీని స్థాపించి.. ఆ పార్టీ ప్రచారంలో తిరుగుతూ రీసెంట్ గా జరిగిన తమిళనాడు అస్సాంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. చాలామంది హీరోలు.. సినిమాల తో వచ్చేసిన విపరీతమైన ఫేమ్ పొలిటికల్ గా యూస్ అవుతుంది అనే ఊహలో రాజకీయాల్లోకి వచ్చి ఏదో సాధించేద్దామని చేతులు కాల్చుకున్నట్టుగానే కమల్ హాసన్ కూడా మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు.
అస్సాంబ్లీ ఎన్నికల్లో భాగంగా కోయంబత్తూరు సౌత్ నుంచి బరిలోకి దిగిన కమల్ హాసన్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే కమల్ హాసన్ ఓటమిపై ఆయన పెద్ద కూతురు శృతి హాసన్ స్పందించింది. కమల్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ చిహ్నమైన టార్చిలైటును పట్టుకుని ఉన్న కమల్ ఫొటోను తన సోషల్ మీడియా పేజీ లో షేర్ చేస్తూ.. తన తండ్రిని చూస్తే గర్వంగా వుంది (so proud of my appa) అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం శృతి ట్వీట్ వైరల్ అవుతుంది.