కేసీఆర్ ప్రభుత్వంలో హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేంద్ర రోజూ కరోనా పరిస్థితులపై సమీక్షలు చేస్తూ ప్రెస్ మీట్స్ పెడుతూ నానా హడావిడి చేస్తున్నారు. ఈ కరోనా కష్టకాలంలో పేదలకి సహాయం చెయ్యాల్సిన ఓ మంత్రి అయ్యుండి ఈటెల అరాచకాలకు, భూ, ధనదాహానికి నిరుపేదలు ఎంతగా నష్టపోయారో అనేది చూస్తే నిజంగా మంత్రి ఈటెల ఇలాంటి వారా అంటారు. పేదల భూముల్లో నుండి తన కోళ్ల ఫారం కోసం రోడ్డు వేస్తున్న ఈటెల సహచరులని అడ్డుకుని సీఎం కేసీఆర్ కి ఆ పేద రైతులు తమ భూమి కోసం ఫిర్యాదు చేయడంతో ఈటెల భూ భాగోతం వెలుగులోకి వచ్చింది.
ఈటెల రాజేంద్రకి చెందిక జమున హ్యాచరీస్ కోసం పేదల భూముల నుండి రోడ్లు వేస్తున్నారని ఆరోపించడమే కాదు.. ఈటెల ఆయన అనుచరులు పేదల భూములని తక్కువ ధరలకే కొనేసి, కొంతమంది దగ్గర అక్రమంగా భూములు లాక్కుని ఇబ్బంది పెడుతున్నారని, జమున హ్యాచరీస్ కోసం పేదల్ని బెదిరిస్తున్నారని సీఎం కేసీఆర్ కి వినతి పత్రాలు అందించారు పేద రైతులు. మెదక్ జిల్లా మాజీ కలెక్టర్ ఈటెల రాజేంద్ర భూ ధన దాహాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఎకరం 40 లక్షలున్న భూమిని కేవలం 10 లక్షలకు కొనడమే కాకూండా, మా భూమి పత్రాలు మా దగ్గరే ఉన్నా.. మమ్మల్ని బెదిరిస్తున్నారంటూ పేద రైతులు రోడ్డెక్కారు.
మెదక్ జిల్లా ముసాయి పేట.. అచ్చం పేటలో ఈటెల కోళ్ల ఫారం పెట్టడంతో.. ఆ దుర్వాసానికి ఊరిలో వారు నానా ఇబ్బందులు పడుతున్నారని, తమ నుండి లాక్కున్న భూములని ఈటెల నుండి ఆయన అనుచరుల నుండి ఇప్పించాలని పేద రైతులు కేసీఆర్ కి మోర పెట్టుకుంటున్నారు. ఈటెల భూ దాహంతో కొన్న భూములు ఆయన భార్య జమున, కొడుకు నితిన్ పేర్ల మీద పెట్టినట్టుగా మెదక్ జిల్లా మాజీ కలెక్టర్ చెబుతున్నారు. ఈటెల రాజేంద్ర ఓ మంత్రి అయ్యుండి ఇలా డైరెక్ట్ గా దొరకడం అంటే అడ్డంగా ఇరుక్కున్నట్టే. ఈ విషయంపై సీఎం కేసీఆర్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అంటూ అందరూ ఎదురు చూస్తున్నారు.