‘పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి’ అంటూ రాజకీయనాయకులు, సినీ సెలబ్రిటీలు, మెగాభిమానులు ట్విట్టర్ వేదికగా కోరడంతో.. ఈ పదం శుక్రవారం ట్రెండ్ అయింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్ అనే విషయం తెలిసిన వారంతా సోషల్ మీడియా వేదికగా.. ఆయన త్వరగా కోలుకోవాలి అంటూ.. ప్రార్థనలు చేస్తున్నట్లుగా రియాక్ట్ అయ్యారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు, బిజేపీ ప్రముఖులు.. ఇలా ఎందరో ఉన్నారు పవన్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నవారిలో. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన విష్.. సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అంతకుముందు పవన్ ‘వకీల్ సాబ్’ చిత్ర విషయంలో కూడా మహేష్ రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. ఒక్క మహేష్ అనే కాదు.. పవన్‌కి కరోనా పాజిటివ్ అని తెలిసిన సెలబ్రిటీలందరూ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయి.. పవన్‌కు జాగ్రత్తలు చెప్పడమే కాకుండా.. ఆయన త్వరగా కోలుకుని.. మళ్లీ ప్రజలలోకి రావాలని ప్రార్థిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ కరోనాకి గురైంది అక్కడేనా?
ఏపీలో రాజకీయం ఘాటుగా ఉన్నా.. జనసేన నేత పవన్ కల్యాణ్.. స్వయంగా పార్టిసిపేట్ చేయకుండా నాదెండ్ల మనోహర్‌తో నడిపిస్తూ.. రోజూ రెండు సినిమాలలో నటిస్తూ పవన్ బిజీగా ఉన్నారు. ఈ నెల మూడో తేదీన తిరుపతి ఉప ఎన్నికల నిమిత్తం పవన్ కల్యాణ్ తిరుపతి బహిరంగ సభలో పాల్గొనాల్సి వచ్చింది. ఆ సభకు పవన్ ర్యాలీగా వెళ్లారు. మధ్యలో కొందరు (ఎవరో అందరికీ తెలిసిందే) కొన్ని అడ్డంకులు సృష్టించడంతో.. ఆయన బండిదిగి నడుచుకుంటూ.. సభా ప్రాంగణంకు వెళ్లారు. ఇక్కడే పవన్‌కు కరోనా అటాక్ అయి ఉండవచ్చని అంతా అనుకుంటున్నారు. జనం మధ్యలో కదలలేని స్థితిలో పవన్ నడుచుకుంటూ.. వెళ్లారు. అప్పుడు అనేక మంది అతనిని తాకారు. ఆ సభ జరిగిన మరుసటి రోజే.. ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అక్కడ పవన్ కల్యాణ్ జాగ్రత్తగానే.. అంటే మాస్క్ పెట్టుకోవడం, శానిటైజర్ చేతులకు రాసుకోవడం వంటివి చేశారు. కానీ అంతకు ముందే అంటే తిరుపతి బహిరంగ సభకు వెళ్లే దారిలోనే పవన్‌కు కరోనా అంటుకుని ఉంటుందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన, తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటూ.. డాక్టర్ల ఆధ్వర్యంలో చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే ఆయన రికవరీ అయి.. మళ్లీ మాములు స్థితికి వస్తారని డాక్టర్స్ చెబుతున్నారు.