కోలీవుడ్ స్టార్ కమెడియన్ వివేక్ (59) గుండెపోటుతో శనివారం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో కోలీవుడ్ ఒక్కసారిగా షాక్‌కి గురైంది. శుక్రవారం ఉదయమే తనకు శ్వాస ఆడటంలేదని చెబుతూనే.. సడెన్‌గా కుప్పకూలిపోవడంతో.. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఆయనని హాస్పటల్‌లో జాయిన్ చేశారు. ఆయన అలా కుప్పకూలిపోవడానికి 24గంటల ముందే కోవిడ్ టీకా వేయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే వివేక్‌కి గుండెపోటు రావడానికి, కోవిడ్ టీకాకి ఎటువంటి సంబంధం లేదని డాక్టర్స్ చెప్పారు. ఆయన హాస్పిటల్‌లో చేరిన తర్వాత.. కోలుకుని క్షేమంగా రావాలని అందరూ ఎంతగానో ప్రార్థించారు. కానీ హాస్పిటల్‌లో చేరిన కొన్ని గంటల్లోనే ఆయన కన్నుమూశారు.
కోలీవుడ్ స్టార్ కమెడియన్లలో వివేక్‌కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. తనదైన తరహా కామెడీతో.. ప్రేక్షకులను అలరించారాయన. కోలీవుడ్ స్టార్ హీరోలందరి చిత్రాలలో నటించిన ఘనత కూడా ఆయనకు దక్కుతుంది. రజినీ, అజిత్, విజయ్ వంటి వారు వివేక్ అంటే ఎంతో ఇష్టపడతారు. ఖచ్చితంగా అతను తమ సినిమాల్లో ఉండాలనే వారే కోరేవారు. ‘పద్మశ్రీ’ అవార్డు కూడా అందుకున్న వివేక్ టీవీ హోస్ట్‌గానూ పని చేసి.. అబ్దుల్ కలాం వంటి వారిని ఇంటర్వ్యూ చేశారు. అలాగే ఎన్నో సామాజిక కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఆయన మరణం నిజంగా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం.