ఎటువంటి హీరో అయినా.. సినిమా చేయాలని కోరుకునే దర్శకులలో ప్రథమస్థానంలో ఉండే దర్శకులు శంకర్, రాజమౌళి. వీరిద్దరి స్థానం, స్థాయి ఇప్పుడు ఈక్వల్ రేంజ్‌లో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే.. శంకర్ స్థాయిని రాజమౌళి బాహుబలి రూపంలో మించిపోయాడనే చెప్పుకోవాలి. అలాగే ప్లానింగ్ విషయంలో కూడా శంకర్‌ని రాజమౌళి మించేశాడు. అందుకే ఒక్కసారి రాజమౌళి సినిమా స్టార్ట్ చేశాడంటే.. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేనంతగా మార్కెట్ క్రియేట్ చేశాడు. కానీ శంకర్ పరిస్థితి అలా లేదు. ఆయన చేయాలనుకున్న, చేస్తున్న ప్రతి చిత్రం కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంది. ఆయన చేస్తున్న ‘ఇండియన్ 2’ అనూహ్యంగా ఆగిపోగా.. చేయాలనుకుంటున్న ‘అన్నియన్’ (అపరిచితుడు) కూడా ఇప్పుడు కాంట్రవర్సీలో చిక్కుకుంది.
‘అన్నియన్’ (అపరిచితుడు) చిత్ర నిర్మాత అస్కార్ వి రవిచంద్రన్.. ఈ చిత్ర కథకి సంబంధించి హక్కులు తన దగ్గర ఉన్నాయని, తన అనుమతి లేకుండా బాలీవుడ్‌లో ఈ సినిమా ఎలా రీమేక్ చేస్తావంటూ.. శంకర్‌కు ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. అలాంటి ప్రయత్నాలు చేస్తే లీగల్‌గా సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుందని కూడా హెచ్చరించాడు. అయితే దీనికి శంకర్ కూడా ఘాటుగానే బదులిచ్చాడు. ‘అన్నియన్’ చిత్రానికి సంబంధించి కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే అనేలా చెబుతూ.. ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్లుగా శంకర్ కూడా ఓ లేఖను రవిచంద్రన్‌ను పంపాడు. అందులో ‘‘అన్నియన్ చిత్ర హక్కులు మీవని చెప్పడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. మీరు చెప్పిన సుజాత కేవలం డైలాగ్స్ విషయంలో ఈ సినిమాకి పని చేశారు. ‘అన్నియన్’కు సంబంధించి కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం అన్నీ నావే. ఈ సినిమాని ఎక్కడైనా రీమేక్ చేసుకునే హక్కు నాకు మాత్రమే ఉంది. నా సినిమాతో గుర్తింపు పొందిన మీరు ఇప్పుడిలా బెదిరించేలా వ్యాఖ్యలు చేయడం నిజంగా నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు కూడా నేను చేయాలనుకుంటున్న ప్రాజెక్ట్స్ ద్వారా గుర్తింపు పొందాలని చూడటం దురదృష్టకరం. నా వివరణతో అయినా మీలో మార్పు, బుద్ది వస్తుందని భావిస్తున్నాను. నా కెరీర్‌పై దాడి చేసేలా వ్యాఖ్యలు చేయడం మానుకోండి..’’ అని శంకర్ సుదీర్ఘంగా లేఖలో ప్రస్తావించారు. మరి శంకర్ వివరణతో అయినా ఈ గొడవ ఇంతటితో ఆగుతుందో.. లేదంటే మళ్లీ రవిచంద్రన్ హర్టయ్యి కోర్టు, కేసులు అంటూ హడావుడి మొదలెడతాడో.. తెలియాలంటే.. రవిచంద్రన్ నుంచి రిప్లయ్ వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.