గత ఏడాది కరోనా క్రైసిస్ తో థియేటర్స్ మూత బడడంతో ఓటిటి సంస్థలు రాజ్యమేలాయి. మీడియం బడ్జెట్, అలాగే చిన్న సినిమాలను కొనేసి నేరుగా ఆన్ లైన్ లో విడుదల చేసేశాయి. లాక్ డౌన్ వలన థియేటర్స్ మూత బడడంతో దిల్ రాజు వంటి నిర్మాతలే తమ సినిమాలను ఓటిటిలో రిలీజ్ చేసేసరికి చాలామంది ఓటిటి దారి పట్టారు. కొంతమంది వెయిట్ చేసి వెయిట్ చేసి థియేటర్స్ లోనే సినిమాలను విడుదల చేసి హిట్ కొట్టారు. గత ఏడాది ఓటిటి సంస్థలు నువ్వా - నేనా అంటూ చాలా సినిమాలను ఎక్కువ ధరలకు కొనుగోలు చేసాయి. అందులో అమెజాన్ ప్రైమ్ వారు కొన్న వి, నిశ్శబ్దం మూవీస్ కి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో అందరికి తెలుసు. ఇక ఆహా లాంటి చిన్న ఓటిటీ కూడా చిన్న సినిమాలను ఎడా పెడా కొనేసింది.
మళ్ళీ థియేటర్స్ తెరుచుకున్నాయి.. ఓటిటీలు కామ్ అయ్యాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలను కొనుక్కుని ఆన్ లైన్ స్ట్రీమింగ్ చేస్తున్నాయి. కరోనా సెకండ్ వెవ్ తో థియేటర్స్ మూత బడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 50 పర్సెంట్ అక్యుపెన్సీతో థియేటర్స్ నడిచినా.. మళ్ళీ థియేటర్స్ పూర్తిగా మూతబడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇక చిన్న, మీడియం హీరోలు ఈసారి థియేటర్స్ కోసం వెయిట్ చేసే ఉద్దేశ్యం లేని వారు తమ సినిమాలని ఓటిటీలకి అమ్మేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.
అందుకే అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ఆహా ప్రతినిధులు అప్పుడే రంగంలోకి దిగిపోయి.. నిర్మాతలు చెప్పిన రేట్లకి బేరాలు మొదలు పెట్టారట. ఈసారి గుడ్డిగా సినిమాల్ని భారీ ధరలకు కొనేసి చేతులు కాల్చుకోకుండా ఓటిటి సంస్థలు నిర్మాతల దగ్గర బెట్టు మొదలు పెట్టాయట. నిర్మాతలు చెప్పినదాన్ని చెప్పినట్టుగా తలూపకుండా నిర్మాతలకు ఎదురు కండిషన్ పెట్టడమే కాదు.. ధరల దగ్గర బాగా స్ట్రిక్ట్ గా ఉంటున్నారట. ఎందుకంటే మళ్ళీ కొన్ని నెలలపాటు థియేటర్స్ మూత బడడం ఖాయమనే సంకేతాలు ఓటిటీలకు వెళ్లడమే దీనికి కారణమట. అందుకే నిర్మాతల దగ్గర ఓటిటి లు తమ తెలివిని చూపిస్తున్నాయనే టాక్ వినిపిస్తుంది.