‘అత్తారింటికి దారేది’ చిత్రంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్.. ఇప్పుడు తన దారేటో తేల్చుకోలేకపోతున్నాడా? అంటే అవునని చెప్పకతప్పదు. అదెలా అంటే.. ‘అల వైకుంఠపురములో’ సినిమా డైరెక్ట్ చేసి.. దాదాపు సంవత్సరంన్నర అయినా కూడా.. ఆయన తదుపరి ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లలేదు. కరోనా లాక్‌డౌన్ తర్వాత డైరెక్టర్స్ అందరూ వారి ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటే.., త్రివిక్రమ్ మాత్రం పవన్ కల్యాణ్ సినిమాలకు డైరెక్టర్స్‌ని సెట్ చేసే పనిలోనే నిమగ్నమై ఉన్నాడు. ఇక ఆయన రెడీ చేసుకున్న ప్రాజెక్ట్.. ఇప్పుడు తారుమారు అయినట్లుగా కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు సంచరిస్తున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఆయన చేయాలనుకున్న ప్రాజెక్ట్ ఇప్పుడు ఆగిపోయిందని, ఎన్టీఆర్ కాకుండా మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా ఉంటుందనేలా వార్తలు వచ్చాయి. ఇదే నిజమైతే.. తన కెరియర్‌లో ఎప్పుడూ లేని విధంగా ఎన్టీఆర్ సినిమా కోసం త్రివిక్రమ్ తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. అది కూడా వడ్డీతో సహా ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించాల్సివుంది. హారిక అండ్ హాసిని అంటే అది త్రివిక్రమ్ సొంత సంస్థే కాబట్టి.. అక్కడ అడ్వాన్సుల మాటే లేదు. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా భాగమైంది. ఈ సినిమా నిమిత్తం నందమూరి కల్యాణ్ రామ్.. త్రివిక్రమ్‌కి కోటి రూపాయల అడ్వాన్స్ ఇచ్చాడనే టాక్ నడుస్తోంది. ఎలాగూ సినిమా క్యాన్సిల్ అయింది కాబట్టి.. ఆ కోటి రూపాయలను వడ్డీతో సహా త్రివిక్రమ్ తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి ఇదేమంత పెద్ద అమౌంట్ కాదు కానీ.. ఓ నిర్మాత దగ్గర నుంచి తీసుకున్న అడ్వాన్స్ తిరిగి, వడ్డీతో సహా ఇవ్వాల్సిన పరిస్థితి ఈ మధ్య కాలంలో ఏ డైరెక్టర్‌కి వచ్చి ఉండదు. అందులోనూ టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్‌కి రావడం.. నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే. మరి నిజంగానే ఎన్టీఆర్- త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఆగిపోయిందా? త్రివిక్రమ్ తీసుకున్న అడ్వాన్స్‌తో సహా తిరిగి ఇచ్చేస్తున్నాడా? ఒకవేళ అదే జరిగితే.. త్రివిక్రమ్ తదుపరి స్టెప్ ఏంటి? అనే విషయాలపై ఇంకొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.