ఏప్రిల్ 6 ... అంటే నిన్నటితో తమిళనాడు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. కాగా ఈ ఎన్నికలలో చాలామంది దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది విలక్షణ నటుడు కమల్ హాసన్ అనే చెప్పాలి. మక్కల్ నీది మయ్యం అనే రాజకీయ పార్టీని స్థాపించి కాస్త గట్టిగానే హడావిడి చేసారు కమల్. అటు మరో సీనియర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాను అని తేల్చి చెప్పెయ్యడంతో ఇక అందరూ కూసింత క్యూరియస్ గా కమల్ వైపు టర్న్ అయ్యారు. అయితే మక్కల్ నీది మయ్యం పార్టీ నుంచి మరీ అద్భుతాలు ఎవరూ ఏమీ ఎక్స్ పెక్ట్ చెయ్యట్లేదు కానీ.. కోయంబత్తూర్ సౌత్ నుంచి స్వయంగా బరిలోకి దిగి పోటీలో నిలబడ్డ కమల్ కి ఎంతవరకూ ప్రజామోదం లభిస్తుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే మొన్నటివరకూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపిన కమల్ నిన్న ఎలక్షన్ కంప్లీట్ అవగానే రాజకీయాన్ని పక్కన పెట్టేసి నేడు మళ్ళీ రంగుల ప్రపంచం వైపు వచ్చేయడం విశేషం. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా విక్రమ్ అనే ప్రాజెక్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 7 కమల్ బర్త్ డే సందర్భంగా విక్రమ్ మూవీ టీజర్ కూడా వదిలాడు లోకేష్ కనగరాజ్. ఇపుడు ఇదే సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తున్నాం అంటూ తన హీరో కమల్ సాక్షిగా ట్వీటాడు సదరు దర్శకుడు. అంటే మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు రాజకీయాన్ని పక్కనెట్టి ఇక పనిలో పడినట్టే. అన్నట్టు మరి భారతీయుడు 2 పరిస్థితి ఏమిటో.. శంకర్ - లైకా ప్రొడక్షన్స్ గొడవ ఎప్పటికి తేలుతుందో..!!