మహారాష్ట్రలో కోవిడ్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. బాలీవుడ్ నటులు వరసగా కోవిడ్ బారిన పడుతున్నారు. పెద్ద పెద్ద స్టార్ హీరోలే కరోనా పోజిటివ్స్ తో హోమ్ క్వారంటైన్ కి వెళుతున్నారు. అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అలియా భట్ తాజాగా కత్రినా కైఫ్ ఇలా వరుసబెట్టి కరోనాకి దొరికిపోతుంటే.. సినిమాల షూటింగ్స్ అన్నీ వాయిదా పడడమే కాదు.. ఇటు మహారాష్ట్ర సర్కారు వీకెండ్ లాక్ డౌన్స్, అలాగే నైట్ కర్ఫ్యూస్ అంటూ కరోనా నిబంధనలు పెట్టడంతో థియేటర్స్ లో రోజూ రెండు షోస్ క్యాన్సిల్ అవుతున్నాయి. అలాగే ప్రేక్షకులు ఎక్కువగా ఉండే వీకెండ్ లో లాక్ డౌన్ అంటే.. థియేటర్స్ లో బొమ్మ పడినా బాక్సాఫీసు కలెక్షన్స్ ఉండవు. అందుకే ఇప్పుడు బాలీవుడ్ లో బడా మూవీస్ అన్ని వాయిదాల దిశగా పయనిస్తున్నాయి. ఇప్పటికే హిందీ లో రానా అరణ్య ని పోస్ట్ పోన్ చేసారు.
తాజాగా అక్షయ్ కుమార్ సూర్యవంశీ వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు అమితాబ్ బచ్చన్ చెహ్రీ, సైఫ్ అలీ ఖాన్ బంటి ఔర్ బాబ్లీ 2 ఇలా చాలా సినిమాలు వాయిదా పడుతుంటే.. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో.. మే లో రిలీజ్ కాబోయే రాధే లాంటి బడా మూవీస్ కూడా వాయిదా పడినా ఆశ్చర్య పడక్కర్లేదు అంటున్నారు నిపుణులు. గత ఏడాది థియేటర్స్ బంద్ వలన వేల కోట్లు నష్టపోయిన బాలీవుడ్ కి మరోసారి అదే నష్టాలూ కంటిన్యూ అయ్యేలా కనిపిస్తుంది. ఇక వరసగా సినిమా రిలీజ్ లు మాత్రమే వాయిదా పడడం లేదు. సినిమాల షూటింగ్స్ కూడా నటులకు కరోనా సోకడంతో ఎక్కడికక్కడే వాయిదాలు పడుతున్నాయి.