సూపర్ స్టార్ రజినీకాంత్ కి ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ని ప్రకటించారు. సౌత్ నెంబర్ వన్ హీరో రజినీకాంత్ కి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించడం పై ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కోలీవుడ్ లోనే కాదు.. సౌత్ భాషలన్నిటిలోనూ సూపర్ స్టార్ కి విశేష అభిమాన గణం. ఆయన స్టయిల్ కి అందరూ ఫిదానే. అప్పటికి ఇప్పటికి అదే ఎనేర్జి తో సూపర్ స్టార్ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. కాకపోతే రాజకీయాల విషయంలో రజినీకాంత్ కి కలిసిరావడం లేదనే చెప్పాలి.
ఎప్పటినుండో రాజకీయ ప్రవేశం కోసం సూపర్ స్టార్ ప్రయత్నించడం.. ఏవో కారణాల వలన అది కాస్తా ఆగిపోవడం చూస్తూనే ఉన్నాం. కానీ సినిమాల విషయానికొచ్చేసరికి రజిని అసలు గ్యాప్ తీసుకున్నదే లేదు. వరస ప్లాప్స్ పడినా రజినీకాంత్ క్రేజ్, ఇమేజ్ ఇసుమంతైనా తగ్గనివ్వరు ఆయన అభిమానులు. ఓ సాధారణ వ్యక్తి అన్ని కోట్ల మంది ప్రేక్షకుల హృదయాల్లో గుడి కట్టించుకోవడం సామాన్యమైన విషయం కాదు.. అలాంటి సూపర్ స్టార్ కి ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం నిజంగా గర్హించదగిన విషయం.