స్టార్ మా లో ప్రసారం అయ్యే కార్తీక దీపం సీరియల్ గురించి తెలియని వారుండరు. ఎన్ని షోస్ వచ్చినా, ఎన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ వచ్చినా కార్తీక దీపం సీరియల్ కి వచ్చే టీఆర్పీ రేటింగ్స్ కొట్టలేక చేతులెత్తేస్తున్నాయి. బుల్లితెర మీద కార్తీక దీపం సీరియల్ నెంబర్ వన్ సీరియల్. అసలు సీరియల్స్ అంటేనే చిన్న పాయింట్ పట్టుకుని ఏళ్లతరబడి లాగించేసే కథలు. అలాంటిది కార్తీక దీపం సీరియల్ లో ఎంతో పెద్ద చదువు చదివి డాక్టర్ వృత్తిలో ఉన్న ఓ యువకుడు తనకి పిల్లలు పుట్టరనే ఓ డాక్టర్ సర్టిఫికెట్ ని నమ్మి, తన భార్యని అనుమానించి అవమానించడం అనేది గత మూడేళ్ళుగా చూస్తున్నారు ప్రేక్షకులు. అయినా కార్తీక దీపం సీరియల్ క్రేజ్ మాత్రం తగ్గలేదు.
డాక్టర్ బాబు గా కార్తీక్ పాత్రలో బుల్లితెర హీరో నిరుపమ్ నటిస్తుంటే.. దీప పాత్రలో ప్రేమి విశ్వనాధ్ కనిపిస్తుంది. అందరి సపోర్ట్ ఉన్నా భర్త ఆదరణకు నోచుకోలేక ఇద్దరి పిల్లలితో ఒంటరి జీవితం గడుపుతున్న దీపంటే బుల్లితెర ప్రేక్షకులకు జాలి, కార్తీక్ అంటే కోపం అయినా సీరియల్ చూడడం మానరు. దాని టీఆర్పీ తగ్గదు. కానీ అందులో డాక్టర్ బాబుగా నటిస్తున్న నిరుపమ్ కే తన పాత్ర చూస్తుంటే కోపమొస్తుందట. తనకి ఆ కేరెక్టర్ నచ్చి ఈ సీరియల్ చేస్తున్నా అని, భార్యని అనుమానించినా బిడ్డని ప్రేమించే తండ్రిగా ఆ కార్తీక్ పాత్రలో బరువైన ఎమోషన్స్ తనకి నచ్చాయని, కానీ తన పాత్ర పదే పదే భార్యని హింసించడం, ఆమెను కించపరచడం తనను కూడా ఇబ్బంది పెడుతుందని చెబుతున్నాడు.
ఆ సీరియల్ కథానుగుణంగా అది తప్పడం లేదని.. బయటికి ఎక్కడికి వెళ్లినా దీప మీరు ఎప్పుడు కలుస్తారు. దీపని ఎందుకలా ఇబ్బంది పెడతారు అనే ప్రశ్నలు తనకి ఎదురవుతున్నాయని అంతేకాదు.. కొంతమంది ప్రేక్షకులు కార్తీక దీపం సీరియల్ కి బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి బెదిరింపులకు దిగుతున్నారని.. అది ఆ సీరియల్ డైరెక్టర్, నిర్మాతలకు తెలిసి తన కేరెక్టర్ లో మార్పులు చేస్తుంటారని చెప్పుకొచ్చాడు నిరుపమ్.