శర్వానంద్ - ప్రియాంక మోహన్ జంటగా నటించిన శ్రీకారం మూవీ మహా శివరాత్రి రోజున విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రైతు కష్టాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించింది. ఒక టాలెంటెడ్ యువకుడు పేరు, హోదా, ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం కోసం తన ఊరు వచ్చెయ్యడం, తండ్రి మాత్రం కొడుకు అమెరికా వెళ్లబోతున్నాడు తమ జీవితాలు మారతాయంటూ చెప్పుకోవడం, కానీ ఉద్యోగం వదిలి వచ్చిన కొడుకు వ్యవసాయం చేస్తానంటే తండ్రి ఖంగు తింటాడు. ఉద్యోగంలో కావల్సిన జీతాలు అందుకున్నా ఎక్కడో ఏదో అసంతృప్తి తో ఉండే యూత్ చాలామంది వ్యవసాయం చెయ్యడానికి సంకల్పించడం అనేది శ్రీకారంలో చూపెట్టారు.
ఇప్పుడు ఈ సినిమా చూసిన భారత్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శ్రీకారం సినిమాపై ట్వీట్ వెయ్యడం అందరిని ఆకర్షించింది. గతంలో మహర్షి సినిమా చూసి వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు రావాలంటూ మహర్షి సినిమా అప్పుడు ట్వీట్ చేసిన వెంకయ్య నాయుడు ఇప్పుడు శ్రీకారం సినిమా చూసి..వ్యవసాయ పునర్వైభవం కోసం గ్రామాలకు మరలండి అనే స్ఫూర్తిని యువతలో రేకెత్తించే విధంగా తెరకెక్కించిన ‘శ్రీకారం’ చక్కని చిత్రం. కుటుంబం, ఊరు అందరూ కలిసి ఉంటే సాధించలేనిది ఏదీ లేదనే చక్కని సందేశాన్ని అందించిన చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులకు శుభాకాంక్షలు.అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామాలకు అందించి, వ్యవసాయంతో జోడించి, పరస్పర సహకారంతో ఆత్మవిశ్వాసంతో అన్నదాత ముందుకు వెళ్ళవచ్చు అన్న సందేశాన్ని శ్రీకారం అందిస్తోంది. యువత చూడదగిన చక్కని చిత్రం. అంటూ ట్వీట్ చేసారు.