గత ఏడాది ఇదేరోజున (మార్చ్ 22)న ప్రధాని మోడీ కరోనా కట్టడి కోసం జనతా కర్ఫ్యూకి పిలునివ్వడంతో.. దేశ వ్యాప్తంగా అన్ని మూగబోయాయి. ఎక్కడికక్కడ అన్ని నిలిచిపోయాయి. ఎవరి ఇంట్లో వాళ్ళు ఈ జనతా కర్ఫ్యూని అమలు చేసారు. రోడ్డు మీద పిట్ట లేదు, షాప్స్ బంద్, థియేటర్స్ బంద్, స్కూల్స్ బంద్, కాలేజెస్ బంద్. ఆఖరికి ప్రభుత్వ కార్యకలాపాలు కూడా స్తంభించిపోయాయి. అంతా బంద్. జనతా కర్ఫ్యూ విధించి ఈ రోజుకి ఏడాది పూర్తయ్యింది. జనతా కర్ఫ్యూ కాస్తా నాలుగు నెలల పాటు లాక్ డౌన్ గా మారింది. నిత్యవసరాల కోసం మాత్రం ప్రజలు రోడ్డెక్కేవారు కానీ.. మిగతా ప్రతి విషయం బంద్. ఈ కర్ఫ్యూ, లాక్ డౌన్ వలన చాలామంది పేదరికంలోకి వెళ్లిపోగా.. మరికొంతమంది తినడానికి తిండిలేక ఇబ్బందులు పడ్డారు. కరోనా కట్టడి కోసం ఈ లాక్ డౌన్ తప్పలేదు.
మోడీ పిలుపుతో ఇళ్లకే పరిమితమైన జనం జూన్ నాటికీ.. మెల్లగా రోడ్లెక్కడం ప్రారంభించారు. కరోనా చేయి దాటిపోయింది. అప్పటినుండి కేసులు పెరుగుదల, మరణాల సంఖ్య పెరిగినా.. చేసేది లేక ఆంక్షలతో కూడిన లాక్ డౌన్ అమలు చేసింది ప్రభుత్వం. మార్చ్ 22 న మొదలైన మాస్క్, శానిటైజేర్స్ ఇప్పటికి కంటిన్యూ అవుతున్నాయి. ఇక జనవరి నుండి కరోనా టీకా వాడుకలోకి వచ్చేసింది.. కరోనాకి భయపడక్కర్లేదు.. అంటూ జనాలు కరోనా కి భయపడడం మానేశారు. ఫలితం మళ్ళీ కరోనా విజృంభణ మొదలయ్యింది. మార్చ్ ఫస్ట్ వీక్ నుండే కరోనా కేసులు దేశవ్యాప్తంగా పెరగడం, మహారాష్ట్ర, కేరళ, నాగ్ పూర్ లాంటి రాష్ట్రాల్లో మళ్ళీ లాక్ డౌన్ అమలు చెయ్యడం చూస్తున్నాం.
తాజాగా తెలంగాణ లో కూడా కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యింది అనే అనుమానాలు మొదలయ్యాయి. మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి.. హాస్పిటల్ బెడ్స్ నిండుతున్నాయి. మొత్తం మీద కరోనా సెకండ్ వేవ్ దేశం మీద మళ్ళీ దాడి చేసినట్టే అని అందరూ డిసైడ్ అవ్వడమే కాదు.. మరోసారి లాక్ డౌన్ తప్పదనే వార్తలు గుండెల్లో గుబులు రేపుతున్నాయి.