గత ఏడాది ఇదే టైం లో సినిమా షూటింగ్స్ అలాగే థియేటర్స్ అన్ని మూత బడ్డాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా వాళ్ళకి కష్టాలు మొదలయ్యాయి. బిగ్ ప్రాజెక్ట్స్ దగ్గరనుండి చిన్న ప్రాజెక్టుల వరకు అన్నిటికి బ్రేకులు పడ్డాయి. దాదాపుగా తొమ్మిదినెలల పాటు థియేటర్స్ బోసిపోయాయి. గత డిసెంబర్ లోనే థియేటర్స్ తెరిచినా 50 పర్సెంట్ అక్యుపెన్సీతో ఫిబ్రవరి ఫస్ట్ వరకు సర్దుకుపోయినా.. తర్వాత 100 పర్సెంట్ అక్యుపెన్సీతో థియేటర్స్ దగ్గర ప్రేక్షకుల హడావిడి మొదలయ్యింది. అందులోనూ ఉప్పెన, జాతి రత్నాలు లాంటి సినిమాలతో ప్రేక్షకుల్లో ఊపుకనిపించింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సినిమా పరిశ్రమకి మరొకసారి కష్టకాలం దాపురించేలా ఉంది.
ఎందుకంటే మళ్ళీ కరోనా సెకండ్ వెవ్ మొదలు కాబోతుంది అనే న్యూస్ కి సినిమా వాళ్ళు ఒణికి పోతున్నారు. మహారాష్ట్ర, నాగ పూర్, కేరళ వంటి రాష్ట్రాల్లో ఎప్పుడో సెకండ్ వేవ్ మొదలు కావడం, లాక్ డౌన్ విధించడం జరిగినా రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసులు తక్కువగానే నమోదు కావడంతో నిన్నటివరకు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ తెలంగాణాలో అందులోనూ హైదరాబాద్ లో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది.. దానితో స్కూల్స్ ని మూసేసే దిశాగా తెలంగాణ ప్రభుత్వం డెసిషన్ తీసుకోవడమే కాదు.. ఏ క్షణమైనా లాక్ డౌన్ పెట్టొచ్చనే ఊహాగానాలు మొదలు కావడంతో సినిమా పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న థియేటర్స్ ని చూసి.. చిన్నా, పెద్ద హీరోలంతా తమ తమ సినిమా రిలీజ్ డేట్స్ ప్రకటించాయి.
వారినికి మూడు నాలుగు సినిమాల చొప్పున థియేటర్స్ లోకి సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకులతో కాస్త కళకళలాడుతున్న బాక్సాఫీసు దగ్గరకి ఇంకా పెద్ద సినిమాల హడావిడి మొదలు కాలేదు. ఏప్రిల్ 9 న వకీల్ సాబ్ తో బిగ్ ప్రాజెక్ట్స్ హడావిడి మొదలుకాబోతుంది. అప్పటినుండి బాక్సాఫీసు కలెక్షన్ మోత కూడా మొదలు కాబోతుంది. కానీ ఈ లోపే కరోనా సెకండ్ వెవ్ అంటూ స్కూల్స్ మూసివేసే దిశాగా ప్రభుత్వం అడుగులు వేస్తుంటే.. థియేటర్స్ మాత్రం ఎందుకు వదులుతారు.. ముందుగా దెబ్బపడేది థియేటర్స్ మీదే. దానితో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కి మరోసారి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు.