ఒక సినిమా తెరకెక్కించి దానిని రిలీజ్ చేయడం అంటే మాములు విషయం కాదు. దర్శకుడు ఎన్ని ఇబ్బందులను ఫేస్ చేసి అయినా సినిమాని అనుకున్న టైం కి అనుకున్నట్టుగా ప్రేక్షకుల ముందుకు తేవడం అనేది అతి పెద్ద టాస్క్. ఆ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయితే ఆ దర్శకుడు పడిన కష్టం అంతా మరిచిపోతాడు. ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తాడు. అదే సినిమా పూర్తయ్యి.. విడుదల కాబోతున్న సమయానికి ఆ డైరెక్టర్ అనారోగ్యంతో మరణిస్తే అంతకన్నా బరువైన బాధ మరొకటి ఉండదు. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో అదే జరిగింది. విజయ్ సేతుపతి - శృతి హాసన్ జంటగా లాభం అనే సినిమాని తెరకెక్కిస్తున్న జాతీయ అవార్డు గ్రహీత జననాథన్ అనుకోకుండా అర్ధాంతరంగా కన్ను ముయ్యడం కోలీవుడ్ ఇండస్ట్రీని తీవ్ర విషాదంలో పడేసింది.
ఆయన దర్శకత్వం వహించిన లాభం సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ లో భాగంగా జననాథన్ ఆ పనులు చూసి ఇంటికి వచ్చిన టైం లో కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆయన్ని హాస్పిటల్ లో జాయిన్ చెయ్యగా.. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఐసియులో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చినా ఆయనని డాక్టర్స్ కాపాడలేకపోయారు. లాభం సినిమాని ఈ సమ్మర్ లో రిలీజ్ చెయ్యడానికి జననాథన్ పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా వున్న టైం లో ఆయన ఇలా మృతి చెందడం పలువురిని బాధపెట్టింది. తమిళంలో నాలుగు సినిమాలను డైరెక్ట్ చేసిన ఆయనకు అవార్డులు రివార్డులు కొత్తేమి కాదు. కానీ ఆయన డైరెక్ట్ చేసిన సినిమా విడుదల కాకుండా ఆయన ఇలా మృతి చెందడం మాత్రం కోలీవుడ్ ప్రముఖులను కలిచివేస్తుంది.