కరోనా రాకముందు హీరోల సినిమాలకి ఓవర్సీస్ బిజినెస్ ఎంత కీలకమో ఆయా సినిమాల ఓవర్సీస్ మర్కెట్ ని బట్టి తెలిసిపోయేది. కానీ కరోనా వచ్చాక అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో థియేటర్స్ మూతబడడం.. అక్కడ కరోనా కంట్రోల్ కాకపోవడంతో ఇక్కడ సినిమా థియేటర్స్ ఓపెన్ అయినా.. ఓవర్సీస్ మార్కెట్ చాలా డల్ గా నడుస్తుంది. అందులోనూ థియేటర్స్ ని ఊపేసే సినిమాలు కూడా అంతగా లేకపోవడం ఒక కారణమైతే, మరొకటి కరోనా. నిన్నమొన్నటివరకు యూఎస్ లో థియేటర్స్ దగ్గర చాలా డల్ గా ఉండి.. బాక్సాఫీసు టికెట్స్ తెగడం లేదు. అంటే చాలా నిస్సారంగా యూఎస్ మార్కెట్ ఉంది.
జస్ట్ క్రాక్, ఉప్పెన సినిమాలు తప్ప అక్కడ మరో సినిమా తన ప్రతాపాన్ని చూపలేదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. సంక్రాంతికి వచ్చిన క్రాక్ సూపర్ హిట్ కలెక్షన్స్ కొల్లగొడితే.. మళ్లీ ఉప్పెనకి ఆ రేంజ్ క్రేజ్ వచ్చి టికెట్స్ తెగాయి. ఇక రీసెంట్ గా మొన్న గురువారం విడుదలైన సినిమాల్లో జాతి రత్నాలు టాక్ తోనే కాదు.. రిలీజ్ కి ముందే యూఎస్ ప్రీమియర్స్ లో కాసుల వర్షం కురిపించింది. ఇక మొదటి షో టాక్ తో అక్కడ జాతి రత్నాల క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. యూఎస్ బాక్సాఫీసు కళకళలాడుతుంది. గతంలో సినిమా విడుదలైనప్పుడు ఏ రేంజ్ క్రేజ్ అయితే థియేటర్స్ దగ్గర కనిపించేదో.. జాతి రత్నాలు సినిమాకి ఓవర్సీస్ లో ఆ రేంజ్ కళకళలు కనబడుతున్నాయి.
అక్కడే కాదు.. జాతి రత్నాలకు పడిన సూపర్ హిట్ టాక్ తో ఇక్కడ కూడా నిర్మాతలకు కాసుల వర్షమే కనిపిస్తుంది. లాంగ్ వీకండ్, పాజిటివ్ టాక్, సినిమా ప్రమోషన్స్ అన్ని వెరసి జాతి రత్నాలు బాక్సాఫీసుని దున్నేస్తుంది. నిన్నటివరకు శ్రీకారం, గాలి సంపత్ సినిమాలు థియేటర్స్ విషయంలో జాతి రత్నాలను తొక్కే ప్రయత్నం చేసినా.. నేటి నుండి గాలి సంపత్ థియేటర్స్ కొన్ని జాతి రత్నాలు ఎగరేసుకుపోవడం ఆ సినిమా క్రేజ్ కి నిదర్శనం. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డ్స్ తో జాతి రత్నాల థియేటర్స్ కళకళలాడుతున్నాయి