RRR లో కొమరం భీం గా నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం విషయంలో ఎప్పటికప్పుడు మీడియాలో ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ప్రస్తుతం చుక్కాని లేని నావలా మారుతున్న టిడిపికి ఎన్టీఆర్ నాయకత్వం అవసరమంటూ పలు సీనియర్ టిడిపి నాయకులు, యూత్ టిడిపి కార్యకర్తలు టీడీపీ ప్రెసిడెంట్ చంద్రబాబు ని డిమాండ్ కూడా చేస్తున్నారు. మొన్నామధ్యన కుప్పం రోడ్ షో లో చంద్రబాబు ని డైరెక్ట్ గానే అడిగేసారు కొంతమంది టీడీపీ కార్యకర్తలు. ఎన్టీఆర్ ని టిడిపిలోకి తీసుకురమ్మని, ఎన్టీఆర్ వస్తే టిడిపిలో మళ్ళీ నూతన ఉత్సాహం వస్తుంది అని. కానీ చంద్రబాబు మౌనం ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశంపై అందరిలో అనుమానాలు పుట్టేలా చేస్తూనే ఉంది. మరోపక్క ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలపై ఎక్కడా ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా సైలెంట్ గానే ఉంటున్నారు.
రీసెంట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు షో కి సంబందించిన ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం పై ప్రశ్నలు సంధించింది మీడియా. మీ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు, రాజకీయాల్లోకి ఎప్పుడు రావాలనుకుంటున్నారు అంటూ ఇండియా మిత్రులు అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ కాస్త క్లారిటీ లేని సమాధానమే చెప్పారు. ఇప్పుడు రాజకీయాలు గురించి మాట్లాడడానికి సమయం కాదు. అలాగే సందర్భము కాదు. నా సమాధానం మీకు తెలుసు.. తర్వాత తీరిగ్గా వాటి గురించి మాట్లాడుకుందాం అంటూ ఎన్టీఆర్ రాజకీయాలపై క్లారిటీ ఇచ్చాడో? కన్ఫ్యూజ్ చేసాడో? అర్ధం కానీ సమాధానం చెప్పి షాక్ ఇచ్చాడు ఎన్టీఆర్.