అలా వైకుంఠపురములో రాయలసీమ స్లాంగ్ ని అద్భుతంగా మాట్లాడించిన పెంచల్ దాస్ ఆ సినిమాలో డైరెక్టర్ త్రివిక్రమ్ కి మేజర్ హెల్ప్ అయ్యారు. అంతకు ముందు కృష్ణార్జున యుద్ధం సినిమాలో దారి చూడూ దమ్ము చూడు సాంగ్ ఒకటి పెంచల్ దాస్ రాసారు. రాయలసీమ భాష విలువని సినిమా పరిశ్రమలో పరిచయం చేసిన పెంచల్ దాస్ ని పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ అభినందించారు.
శ్రీ పెంచల్ దాస్ గారు రాయలసీమ ప్రాంత జానపదాలను, అక్కడి మాండలికాన్నీ నేటి తరానికి చేరువ చేస్తున్న విధానం అభినందనీయం అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. గీత రచయిత, గాయకుడు శ్రీ పెంచల్ దాస్ గారు మంగళవారం హైదరాబాద్ లో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఈ సందర్భంగా తెలుగు జానపదాలు, సీమ మాండలికంపై ఇరువురు మాట్లాడుకున్నారు. ఈ చర్చలో ప్రముఖ దర్శకులు శ్రీ త్రివిక్రమ్ గారు పాల్గొన్నారు. అనంతరం శ్రీ పెంచల్ దాస్ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సత్కరించారు.
రాయలసీమ అంటే ఫ్యాక్షన్, యాక్షన్, కత్తులు, గొడ్డళ్లు, బాంబులు, పేలుళ్లు, పగలు, ప్రతీకారాలు అన్నట్టు మాత్రమే కొన్నేళ్లపాటు అలవాటు పడిపోయిన ప్రేక్షకులకు నిజమైన సీమ సంకృతిని, సీమ సాహిత్యాన్ని, ఆ మట్టి తాలూకు భాషలోని సుగంధాన్ని తెరపై పరిచిన, మనందరికీ పంచిన పెంచలదాస్ కి సకల ప్రాంత ప్రేమికులు, సకల భాషల ఆరాధకులు ముఖ్యంగా సాహిత్యాభిలాషులు అయిన పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ చేతుల మీదుగా ఈ సత్కారం జరగడం సముచితం అనే చెప్పాలి.