గత ఏడాది కరోనా క్రైసిస్ తో కాలం కరిగిపోయింది. టైం కి విడుదల కావాల్సిన సినిమాలన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి. ఈ ఏడాది మొదలయ్యింది మొదలు సినిమాల రిలీజ్ డేట్స్ తో హీరోల హడావిడి మాములుగా లేదు. అందులో ఓ యంగ్ హీరో అయితే ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించి షాకిచ్చాడు. గత ఏడాది లాక్ డౌన్ కి ముందు భీష్మ తో భారీ హిట్ కొట్టిన నితిన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరో వారంలో నితిన్ చెక్ రిలీజ్ కాబోతుంది. దాని తర్వాత వెంకీ అట్లూరి డైరెక్షన్ లో నితిన్ చేసిన రంగ్ దే విడుదలకు డేట్ ప్రకటించాడు.
కీర్తి సురేష్ - నితిన్ జంటగా తెరకెక్కుతున్న రంగ్ దే ఈ ఏడాది మార్చ్ 26 న విడుదల కాబోతుంది. ఈ సినిమాపై ట్రేడ్ లోను ప్రేక్షకుల్లోని మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ముచ్చటగా మూడో సినిమా ఏది అంటే.. నితిన్ ఎంతో ఇష్టపడి చేస్తున్న బాలీవుడ్ రీమేక్ అంధాధున్ సినిమాని కూడా నితిన్ ఈ ఏడాదే రిలీజ్ చేసేస్తున్నాడు. నితిన్ - నభ నటేష్ - తమన్నా ముఖ్యపాత్రలుగా తెరకెక్కుతున్న అంధాధున్ రీమేక్ ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఇంకా టైటిల్ అనౌన్స్ చెయ్యని చిత్ర బృందం ముందుగా డేట్ లాక్ చేసింది. అంధాధున్ రీమేక్ సినిమా జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది అని.. ఓ పోస్టర్ తో సహా రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర బృందం. ఈ పోస్టర్ లో నితిన్ షర్టుపై స్వెటర్ వేసుకొని పియానో ప్లే చేస్తూ కనిపిస్తున్నాడు. అంధాధున్ లో ఆయుష్మాన్ ఖురానా పాత్ర ని నితిన్ చేస్తున్నాడు.
మరి ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అభిమానులకు సూపర్ ట్రేట్స్ ఇవ్వబోతున్నాడు నితిన్.