కరోనా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కరోనా అంతా కకావికలం చేసింది. కరోనాని పక్కనబెట్టి సాధారణ స్థితికి చేరుకుంటున్నా కొన్ని విషయాల్లో కేంద్రం ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా సినిమా థియేటర్స్ లో 50 శాతం ఆక్యుపెన్సీ. సంక్రాంతి సినిమాలకు ఈ 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ 100 శాతానికి చేస్తారేమో అని ఆశపడిన వారికీ మొండి చెయ్యే మిగిలింది. సంక్రాంతికి విడుదల అయిన సినిమాలన్నీ 50 శాతం అక్యుపెన్సీతోనే బ్రేక్ ఈవెన్ తో పాటు లాభాలు మూట గట్టుకున్నాయి. అయితే కేంద్రం అన్ లాక్ ప్రక్రియలో భాగంగా థియేటర్స్ లో ఆక్యుపెన్సీ పెంచబోతున్నట్టుగా అప్ డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 1 నుండి కొత్త గైడ్ లైన్స్ ని జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.
దాని ప్రకారం ఫిబ్రవరి నుండి 50 శాతం అక్యుపెన్సీతో నడుస్తున్న థియేటర్స్ లో సీటింగ్ సామర్ధ్యాన్ని మరింతగా పెంచుతున్నట్టుగా ప్రకటన చేసింది. అది ఫిబ్రవరి 1 నుండే అమలు కానుంది. అయితే ఎంత శాతం పెంచారనేది కేంద్రం త్వరలోనే ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ నెలాఖరు వరకు 50 శాతం అక్యుపెన్సీతో నడవనున్న థియేటర్స్ ఫిబ్రవరి నుండి ప్రేక్షకులతో కళకళలాడడం ఖాయం. ఫిబ్రవరిలో విడుదల కాబోతున్న సినిమాలకు ఇది పెద్ద శుభవార్తే. ఫిబ్రవరి 5 న జంబి రెడ్డి, 12 న ఉప్పెన, 19 రష్మిక పొగరు సినిమాలు రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్నాయి. నిన్నటివరకు 50 శాతం అక్యుపెన్సీతోనే సరిపెట్టుకున్న దర్శకనిర్మాతలు ఇప్పుడు పెరిగిన అక్యుపెన్సీతో రెవిన్యూ పెంచుకోబోతున్నారు.