ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుందో, జరగబోతుందో అందరికి కళ్ళకు కట్టినట్టుగా అర్ధమవుతుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ ని సీఎం ని చేసే విషయంలో బాగా బిజీగా ఉన్నారనే మాట మీడియా సర్కిల్స్ లోనే కాదు.. టీఆరెస్ పార్టీ లోను వినిపిస్తుంది. అందుకే కేటీఆర్ కి మంత్రి పదవి అనేది లేకుండా టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆరెస్ పార్టీని కేటీఆర్ చెప్పు చేతల్లో పెట్టారు. అప్పటినుండి కేటీఆర్ ని సీఎం ని చేయబోతున్నారని అందరికి ఆర్ధమైపోయింది. తగిన సమయం సందర్భం చూసుకుని కేసీఆర్ కుమారుడికి పట్టాభిషేకం చెయ్యడానికి పావులు కదుపుతున్నారు. ఆ విషయాన్నే తన సన్నిహితుల ద్వారా లీకులు కూడా వదులుతున్నారు. అసలు కేటీఆర్ కి సీఎం పదవిని కట్టబెడితే మిగతావారి నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనే విషయంలో ఎప్పుడో కసరత్తులు మొదలు పెట్టబట్టే.. కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చెయ్యబోతున్నారంటూ ఆ పార్టీ వారే మాట్లాడేలా కేసీఆర్ చేస్తున్నారనేది చాలామంది వాదన.
అయితే కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం కుదిరిపోయింది అంటూ ఇప్పుడు ఓ టీఆరెస్ మంత్రి మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ మంత్రి పద్మారావు కేటీఆర్ ని సీఎం ని ఎప్పుడు చేయబోతున్నారో రివీల్ చెయ్యడం వెనుక కేసీఆర్ ఉన్నారా? లేదంటే పద్మారావు అంత గట్టిగా కేటీఆర్ సీఎం అయ్యే విషయంపై అంతగా మట్లాడరు. ఇంతకీ కేటీఆర్ సీఎం అయ్యే ముహూర్తం ఎప్పుడంటే.. యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి గుడి ప్రారంభం అయిన రోజునే కేటీఆర్ సీఎం కాబోతున్నారట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి గుడిని కేసీఆర్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తలదన్నేలా అభివృద్ధి చెయ్యాలని.. దానికి కొత్త మెరుగులు దిద్దాలని సంకల్పించడంతో యాదాద్రి గుడి ఇప్పుడు కొత్త హంగులతో మెరిసిపోతుంది. ప్రస్తుతం గుడి పనులు ముగియడంతో.. ప్రారంభోత్సవానికి తయారైంది.
అయితే ఫిబ్రవరిలో గుడి ప్రారంభోత్సవం ఉండొచ్చని.. ఇప్పటికే కేసీఆర్ చిన జీయర్ స్వామిని కలిసి యాదాద్రి గుడి ప్రారంభోత్సవానికి కి ముహుర్తాలు చూపిస్తున్నారని టాక్ నడుస్తుంది. దానిని బట్టే.. గుడి ఓపెనింగ్ అయిన రోజునే కేటీఆర్ కి పట్టాభిషేకం జరుగుతుంది అని పద్మారావు చెప్పిన మాటలతో.. కేటీఆర్ ఫిబ్రవరిలోనే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.