గత ఏడాది బాలీవుడ్ లోను, శాండల్ ఉడ్ లోను డ్రగ్స్ కేసు మాములు ప్రకంపనలు సృష్టించలేదు. బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో ఊచలు లెక్కబెడితే.. దీపికా పదుకొనె, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ లాంటి వాళ్ళు ఈ కేసులో ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇక శాండల్ వుడ్ లో అయితే సంజన గల్రాని, మరో హీరోయిన్ రాగిణి ద్వివేదీలు ఈ డ్రగ్స్ కేసులో జైలుకెళ్లారు. గత ఏడాది సంజన గల్రానికి బెయిల్ వచ్చినా రాగిణి ద్వివేది మాత్రం నిన్నటివరకు జైల్లోనే ఊచలు లెక్కబెట్టింది. మధ్యలో బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా రాగిణి కి బెయిల్ మంజూరు చెయ్యలేదు కర్ణాటక కోర్టు.
అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయని రాగిణి కి బెయిల్ ఇవ్వలేదు కర్ణాటక హై కోర్టు. దానితో రాగిణి ద్వివేది సుప్రీం కోర్టు మెట్లు ఎక్కగా. గురువారం రాగిణి ద్వివేదీకి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది సెప్టెంబర్ లో బెంగుళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీస్ లు కష్టడీలోకి తీసుకున్న రాగిణి ద్వివేది ఎన్ని నాటకాలు ఆడినా ఆమెకి కోర్టు బెయిల్ మంజూరు చేయకపోవడంతో సుప్రీం కోర్టుని ఆశ్రయించగా ఎట్టకేలకు ఇన్నాళ్ళకి రాగిణి కి బెయిల్ వచ్చి జైలు నుండి బయటపడింది.