నిన్నటివరకు థియేటర్స్ బంద్ తో సినిమాలేవీ విడుదల కాలేదు. ఇప్పుడిప్పుడే థియేటర్స్ తెరుచుకోవడంతో.. సినిమాలన్ని థియేటర్స్ లో రిలీజ్ అవడానికి క్యూ కడుతున్నాయి. సంక్రాంతి బరిలో దిగేందుకు ఉరకలు వేస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో రవితేజ క్రాక్ విడుదలై దూసుకుపోతుంటే.. రేపు భోగి సందర్భంగా తమిళనాట విజయ్ - లోకేష్ కనకరాజ్ కాంబోలో భారీ అంచనాల మధ్యన తెరకెక్కిన మాస్టర్ విడుదల కాబోతుంది. గత మార్చి లో విడుదలవ్వాల్సిన మాస్టర్ ఈ పండక్కి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళనాట థియేటర్స్ తెరిచిన తర్వాత విడుదల కాబోతున్న మొదటి భారీ బడ్జెట్ సినిమా మాస్టర్ కావడంతో ఆ సినిమాపై అంచనాలు, ఆసక్తి పీక్స్ లో ఉన్నాయి.
విజయ్ నటించిన మాస్టర్ సినిమాకి లీకుల రాయుళ్లు భారీ షాకిచ్చారు. మాస్టర్ సినిమాలోని కీలక సన్నివేశాలు కొన్ని ఆన్‌లైన్‌లో లీక్ చేసేసారు. అలా చాలా సన్నివేశాలు ఆన్ లైన్ లో లీకవడంతో చిత్ర బృందం షాకయ్యింది. దీంతో చిత్ర యూనిట్ దిద్దుబాటు చర్యలను చేపట్టింది. వెంటనే లోకేష్ కనకరాజ్ రంగంలోకి దిగి సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ సహా సినీ అభిమానులకు విజ్ఞప్తి చేసుకున్నాడు. ఈ సినిమా కోసం ఏడాదిన్నరగా అందరూ ఎన్నో కష్టాలు చూసారని, పని చేసిన నటీనటుల కష్టం, టెక్నీకల్ సిబ్బంది పడిన ఇబ్బందులను వివరిస్తూ.. ఈ సినిమాని ఆన్ లైన్ లో లీకయినా ఎవరూ షేర్ చెయ్యొద్దు.. థియేటర్స్ లోనే మాస్టర్ సినిమా చూడమని వేడుకుంటున్నాడు.