బిగ్ బాస్ లోకి వెళ్లి విన్నర్ గా బయటికి వచ్చిన శివ బాలాజీకి బిగ్ బాస్ తో క్రేజ్ అయితే వచ్చింది కానీ.. అతనికి అవకాశాలు రాకో.. లేదంటే వచ్చిన వాటిని మిస్యూస్ చేసుకున్నాడో.. విన్నర్ అయ్యాక శివ బాలాజీ బిజీ అయిన సందర్భం రాలేదు. అలాగే కౌశల్ అయితే సినిమా హీరోగా చేసేస్తానంటూ బయలుదేరాడు. కౌశల్ ఆర్మీ అంటూ హడావిడీ చేసాడు. తీరా చూస్తే ఖాళీగా ఉన్నాడు. ఇక రాహుల్ సిప్లిగంజ్ అయితే సింగర్ గా కాస్త మంచి అవకాశాలు పట్టుకుంటున్నాడు. హీరోగా మాత్రం ట్రై చెయ్యలేదు. కానీ ఇప్పుడు సీజన్ 4 విన్నర్ అభిజిత్ కూడా మిగిలిన ముగ్గురు విన్నర్స్ లాగే ఎటు కాకుండా పోయేలా కనబడుతున్నాడు. విన్నర్ గా బయటికొచ్చి నెల కావొస్తున్నా అభిజిత్ కి అవకాశాల ఊసు సోషల్ మీడియాలో లేదు.
ఓ పది రోజుల పాటు సోషల్ మీడియాలో, మీడియా ఛానల్స్ లో హడావిడి చేసిన అభిజిత్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడనుకున్నారు. కథలు వింటున్నాడు.. అవకాశాలు జోరులో తడిచిపోవడం ఖాయం అనుకున్నారు. కానీ అభిజిత్ మాత్రం హీరోగా రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడట. అందుకే తనకొచ్చే చిన్న చిన్న అవకాశాలను వదులుకుంటున్నాడని టాక్. మంచి కథ, మీడియం రేంజ్ బడ్జెట్ ఉన్న సినిమా కథలను సెలెక్ట్ చేసుకుని హీరో గా రీ ఎంట్రీ కోసం చూస్తున్నాడట. మరి అలాంటి అవకాశాలు రావాలంటే బిగ్ బాస్ క్రేజ్ సరిపోతుందా? బిగ్ బాస్ లో ఏం పొడిచాడని అతన్ని పెద్ద హీరోగా పెట్టి సినిమా చేస్తారు నిర్మాతలు? అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోహెల్ లా దూసుకుపోకుండా.. ఆభిజీత్ ఇంకా ఇంత నెమ్మదిగానే ఉండడం ఆయన అభిమానులకి మింగుడు పడడం లేదు.