కరోనా లాక్ డౌన్ థియేటర్స్ వ్యవస్థకు ముప్పు తీసుకువచ్చింది. థియేటర్స్ అన్ని ఎనిమిది నెలల పాటు మూతబడడంతో అందులో పనిచేసే కార్మికులు రోడ్డున పడ్డారు. అయితే డిసెంబర్ మొదటి వారం నుండి థియేటర్స్ ఓపెన్ అయినా 50 శాతం అక్యుపెన్సీతోనే రన్ చెయ్యాలంటూ కేంద్రం హుకుం జారీ చేసింది. అప్పటినుండి ఇప్పటివరకు థియేటర్స్ లో 50 శాతం అక్యుపెన్సీనే నడుస్తుంది. కానీ తమిళనాట మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకూ రాబోతున్న హీరో విజయ్ తమిళనాడు సీఎం దగ్గరకు వెళ్లి 100 శాతం అక్యుపెన్సీకి అనుమతినివ్వమని కోరడం.. తాజాగా తమిళనాడు ప్రస్తుతం 100 శాతం ప్రేక్షకులకు థియేటర్స్ లోకి అనుమతినివ్వడంతో విజయ్ కష్టానికి ఫలితం రాబోతుంది. మార్చ్ లో విడుదల కావాల్సిన విజయ్..థియేటర్స్ కోసం ఎదురు చూసినందుకు 100 శాతం ఫలితం దక్కినట్లే.
కానీ తెలుగు హీరోలకి ఆ అదృష్టం లేదా? లేదనే అనిపిస్తుంది. కుర్ర హీరోలు సంక్రాంతికి సినిమాల విడుదల అంటూ హంగామా చెయ్యడమే కానీ.. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సీఎం లతో మాట్లాడి 100 శాతం ఆక్యుపెన్సీ తెచ్చుకుందామని ఆలోచన లేదా? లేదంటే పరిశ్రమ పెద్దలు పూనుకుని అనుమతులు తేవాలి కానీ మనకెందుకులే అనే ఆలోచనలో ఉన్నారో కానీ.. ప్రస్తుతం ఈ తొమ్మదిన విడుదల కాబోయే రవితేజ క్రాక్, అలాగే 14 సంక్రాతి రోజున రాబోతున్న రామ్ రెడ్ కానివ్వండి, 15 న వస్తున్న బెల్లంకొండ అల్లుడు అదుర్స్ కానివ్వండి.. ఇవన్నీ 50 శాతం ప్రేక్షకులతోనే థియేటర్స్ లోకి దిగుతున్నాయి. మరి మాస్టర్ తో 100 ప్రేక్షకులను రాబడుతున్న విజయ్ ముందు టాలీవుడ్ హీరోలకు ఆ అదృష్టం లేదని సరిపెట్టుకోవాల్సిందేనా..