రజినీకాంత్ సౌత్ సూపర్ స్టార్ అందులో ఎలాంటి సందేహము లేదు. ఆయన బస్సు కండక్టర్ స్టేజ్ నుండి సూపర్ స్టార్ అయ్యేవరకు చాలా సాధారణంగానే ఉండేవారు. ఇప్పటికీ రజినీకాంత్ కి హంగు ఆర్భాటలంటే నచ్చవు. చాలా సాధారణమైన వ్యక్తిగా అందరితో కలిసిపోయే రజినీకాంత్ కి సినిమాలు వరసగా ప్లాప్ అయినా రజినీకాంత్ క్రేజ్ ట్రేడ్ లోను, ప్రేక్షకులలోను అస్సలు తగ్గదు. రజినీకాంత్ సినిమా విడుదల అనగానే కార్పొరేట్ ఆఫీస్ లకి సెలవులు ఇచ్చేస్తారు. అంతటి క్రేజ్ ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు రాజకీయాల్లోకి దిగుతున్నాడు. ఎప్పటినుండో ఫాన్స్ ని ఊరిస్తున్న రజినీ ఎట్టకేలకు రాజకీయాలను ఒంటబట్టించుకున్నాడు. వచ్చే నెలలో రజినీకాంత్ రాజకీయ ప్రయాణం మొదలు కాబోతుంది. కానీ ఇప్పటినుండే రజినీకాంత్ రాజకీయాలపై అవహగాహన, ఎవరితో కలిసి ఎలాంటి పనులు చెయ్యాలో అనే విషయంపై చర్చలు జరుపుతున్నాడు.
తాను పెట్టబోయే రాజకీయ పార్టీ ప్రజల్లోకి వెళ్లి వాళ్ళ మెప్పు పొంది ఎన్నికల్లో గెలవనేది రజినీ ఆలోచన. ఇది ఖచ్చితంగా ప్రజల పార్టీ అనే నినాదం బలంగా ప్రజల్లోకి తీసుకెళితే రజినీ సక్సెస్ సాధించినట్టే. రజినీకాంత్ రాజకీయ పార్టీ అనగానే సినిమావాళ్లు ఎవరెవరు రాజకీయ పార్టీలు పెట్టి సక్సెస్ అయ్యారో.. ఎవరు జీరో అయ్యారో అనే దానిమీద రాజకీయ విశ్లేషకుల చర్చలు, రజినీకాంత్ ఎంజీఆర్, ఎన్టీఆర్ లాగా రాజకీయాల్లో నిలదొక్కుకుంటాడా లేదంటే విజయ కాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాదిరి జీరో గా మిగిలిపోతాడా అని విశ్లేషణలు చేస్తున్నారు. సినిమాల పరంగా రజినీ క్రేజ్ ఆకాశాన్ని తాకుతుంది. కానీ రాజకీయంగా అనేది రజినీ కెపాసిటీని బట్టి ఉంటుంది. సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ కి వచ్చి, ఆడియో వేడుకల్లోనూ స్పీచ్ ఇచ్చి అభిమానులకు చెయ్యి ఊపి వెళ్లిపోవడం కాదు రాజకీయమంటే. ప్రజల్లోకి వెళ్ళాలి.. వాళ్లతో కలిసిపోవాలి, వాళ్ళ మధ్యనే ఉండాలి.
ఎన్నికల ముందు పార్టీ పెట్టి హడావిడి చేసి గెలిచేద్దామా అంటే ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు. ప్రజలు తెలివిమీరిపోయారు. ఎవరి పార్టీ కి ఓటు వేస్తె ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో అని విశ్లేషణలు చేస్తున్నారు. మరి రజినీకాంత్ పార్టీ పెట్టేసి వచ్చే ఎన్నికల్లో మనం పోటీ చేస్తున్నాం అంటూ మీడియా సమావేశాలు నిర్వహిస్తే కుదరదు.. ప్రజలతో మమేకం అవ్వాలి. కరోనా వలన ప్రజా యాత్ర చేయలేకపోయామంటున్నాడు రజినీకాంత్. ఇక ప్రస్తుతం రాజకీయ పార్టీ పేరు, గుర్తులపై కసరత్తులు చేస్తున్నారు రజినీకాంత్ టీం. తన పార్టీ జెండాకి మూడు రంగులు ఉంటాయని, ఒకొక్క రంగుకీ ఒక్కో ప్రత్యేక లక్షణం ఉండేలా రజనీ ప్లాన్ చేసారని.. ఇప్పటికే రజనీ తన పార్టీ పేరు, చిహ్నంపై ఓ నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. మొత్తం మూడు పేర్లను ఈసీ వద్ద నమోదు చేశారని.. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ నెల 31న పార్టీ పేరును రజనీ అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు.
నేడు రజినీకాంత్ పుట్టిరోజు కావడంతో రజినీకి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ పెడుతున్నారు. ఇప్పుడు సినిమా సెలబ్రిటీస్ మాత్రమే కాదు.. ప్రధాని మోడీ నుండి అన్ని రాజకీయపార్టీల నేతలు రజినీకాంత్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలను సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు. ప్రధాని మోడీ అయితే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. మరి రజినీకాంత్ కి ఈ పుట్టిన రోజు ఎంతో ప్రత్యేకం కానుంది.