సినిమాల్లో కోట శ్రీనివాస్ రావు అంటే విలనిజమేకాదు.. మంచి కామెడీ కూడా. అహ నా పెళ్ళంట లో కోట కామెడీకి విరగబడి నవ్వాల్సిందే. ఇక బాబు మోహన్ కామెడీకి నవ్వని ప్రేక్షకుడు ఉండడు. బాబూమోహన్ విలన్ కన్నా కామెడియన్ గానే గుర్తింపు పొందాడు. మరి కోట - బాబు మోహన్ ల కలయికలో ఓ 60 నుండి 70 సినిమాలు తెరకెక్కి ఉంటాయి. వాళ్ళిద్దరి కాంబో కామెడీ, విలనిజం అన్ని ఆయా సినిమాలకే హైలెట్ అనేలా ఉండేవి. బాబు మోహన్ - కోట శ్రీనివాస్ రావు కాంబో సీన్స్ ఒక పక్క విలనిజాన్ని, మరోపక్క కామెడీ ట్రాక్ ని నడిపించేవి. తాజాగా అలీ తో జాలిగా షోకి వచ్చిన కోట శ్రీనివాస్ రావు - బాబు మోహన్ లు సినిమా విషయాలనే కాదు... పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నారు.
కోట శ్రీనివాస్ రావు జులై లో పుట్టిన జులై గాడిని నేను అంటే.. బాబు మోహన్ ఏప్రిల్ లో పుట్టిన నాకు వయసు అక్కడితో ఆగిపోయింది అంటూ నవ్వించేసారు. ఇక బాబు మోహన్ కి ఒక్కసారిగా సినిమాలు తగ్గడానికి పరోక్షంగా చంద్రబాబే కారణమంటున్నాడు. రాజకీయాల్లో ఎమ్యెల్యేగా ఉన్న టైం లో సినిమాలు చేసిన నేను.. మంత్రిని అయ్యాక కాబినెట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అని.. కానీ చంద్రబాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు సినిమాలు పక్కనబెట్టమని చెప్పారని, కామెడీ చేసేవాడిని తీసుకొచ్చి మంత్రి పదవినిచ్చా అంటూ నన్ను కామెంట్స్ చేస్తున్నారని చంద్రబాబు చెప్పబట్టే సినిమాలకు గ్యాప్ ఇచ్చా అని.. కానీ అదే గ్యాప్ చాలా కాలం వరకు కొనసాగింది అని చెప్పాడు బాబు మోహన్.
తాజాగా రెండు మూడు సినిమాలు ఒప్పుకున్నా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయాయి అని అంటున్నాడు బాబు మోహన్. ఇక మేము సినిమాల్లో ప్రేక్షకులను నవ్వించేవాళ్ళం.. కానీ మా జీవితాల్లో మేము మా నవ్వుని పోగొట్టుకున్నాం.. కోట గారికి, నాకు జీవితంలో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. నేను కొడుకుని పోగొట్టుకున్నాను, ఆయన కొడుకుని కోల్పోయారు. ఇక బాబు మోహన్ కి మరొక కొడుకు ఉన్నాడు నాకు అదీ లేదు అంటూ.. మేము అందరిని నవ్వించినా.. ఎప్పుడూ ఏడుస్తూనే ఉన్నామంటూ అందరి కళ్ళల్లో నీళ్లు తెప్పించారు కోట - బాబు మోహన్ లు. సినిమాల రంధిలో పడి వ్యక్తిగత జీవితాన్ని మిస్ అయ్యామని చెబుతున్నారు వీరిద్దరూ.