కరోనాతో థియేటర్స్ బంద్ కాకముందు ఓటీటీ అంటే.. ఆహా, ఓహో.. అనేంత కాకపోయినా.. దానికి మంచి ఆదరణే ఉండేది. కానీ కరోనా ఎప్పుడైతే వచ్చి థియేటర్స్ మూతపడ్డాయో... ఓటీటీల పంట పండింది. ఒక్కసారిగా క్రేజ్ ని సంపాదించేశాయి. క్రేజ్ ఉన్న సినిమాలకు థియేట్రికల్ రైట్స్‌కి ఎంతొస్తుందో అంత ధర పెట్టి కొనేసి డైరెక్ట్ ఓటీటీలలో విడుదల చేశారు. పెద్ద హీరోలకు గాలం వేసినా వాళ్ళు పడలేదు కానీ... మీడియం రేంజ్ హీరోలు ఓటీటీ ఆఫర్స్ కి తలొగ్గారు. తమిళనాడులో అయితే థియేట్రికల్ సంఘాలు బెదిరించినా.. ఒత్తిళ్లు తెచ్చినా... తలొగ్గకుండా హీరో సూర్య తన భార్య సినిమాలను, తన సినిమాలను ఓటీటీలకు అమ్మేశాడు. అలాగే నాని, అనుష్క, చిన్న హీరోలంతా ఓటీటీ బాట పట్టారు.
మార్చి నుంచి ఓటీటీల నుండి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ సో సో అనే టాక్ తోనే నడుస్తున్నాయి. కానీ తాజాగా విడుదలైన సూర్య ఆకాశం నీ హద్దురా సినిమాతో ఓటీటీలు ఊపిరి పీల్చుకున్నాయి. పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రెస్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కొన్న.. వి, నిశ్శబ్దం, పెంగ్విన్ సినిమాలకు హిట్ టాక్ రాలేదు. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సూర్య ఆకాశం నీ హద్దురా కి సూపర్ డూపర్ హిట్ టాక్ రావడమే కాదు.. హిట్ రివ్యూస్ రావడంతో.. అమెజాన్ కి గట్టి బ్లాక్ బస్టర్ పడింది. దానితో ఓటీటీలు ఊపిరి పీల్చుకున్నాయి. థియేటర్స్ ఓపెన్ అయ్యే టైం లో సూర్య సినిమా అమెజాన్ లో విడుదల చెయ్యడం సాహసం అయినప్పటికీ... ఎప్పుడో కుదిరిన డీల్ కాబట్టి.. అందులోనూ సూర్య తన సినిమాల విషయంలో ఓ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి తప్పలేదు. ఆకాశం నీ హద్దురా సినిమాతో అమెజాన్ మాత్రమే హిట్ కొట్టలేదు.. చాలా ఏళ్లుగా హిట్ చూడని సూర్య కూడా ఆకాశం నీ హద్దురా సినిమాతో భారీ హిట్ కొట్టేసాడు.