రాజమౌళి ఆర్ఆర్ఆర్ పై దేశమంతా ఆకాశంలో అంచనాలు. కరోనా లేకపోతే ఈపాటికి ఆర్ఆర్ఆర్ ఓ కొలిక్కి రావడం... వచ్చే జనవరి బొమ్మ పడడం జరిగేది. కానీ కరోనా వలన షూటింగ్ ఆరు నెలలు బ్రేకులు పడడంతో మళ్ళీ మొదలైన ఆర్ఆర్ఆర్ నుండి ఎన్టీఆర్ కొమరం భీం టీజర్ ని విడుదల చేసింది ఆర్ఆర్ఆర్ బృందం. దసరా కానుకగా అలాగే కొమరం భీం జయంతి కానుకగా విడుదలైన ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ స్పెషల్ టీజర్ లో ఎన్టీఆర్ మేకోవర్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సలాం కొడుతున్నారు. కండలతో అదరగొడుతున్న మన్యం ముద్దుబిడ్డ కొమరం భీం అందరికి నచ్చేశాడు. అయితే కొమరం భీం టీజర్ చివరిలో ఓ భారీ ట్విస్ట్ ఇచ్చాడు జక్కన్న. అదే కొమరం భీం పాత్రధారి ఎన్టీఆర్ ముస్లిం గెటప్. ఇపుడు ఆ ట్విస్ట్ పై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. కాంట్రవర్సీ కూడా మొదలైంది.
అయితే రాజమౌళి ఆర్ఆర్ఆర్ కథ ప్రకారం కొమరం భీం - అల్లూరి పాత్రలు అజ్ఞాతంలో కలిసారని.. అక్కడి నుండి వీరిద్దరి ప్రయాణం మొదలైనదని.. అజయ్ దేవగన్ గురువుగా వీరిద్దరూ కలిసి న్యాయ పోరాటం చేస్తారని అన్నాడు. అయితే ఇక్కడ కొమరం భీం ముస్లిం గెటప్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది. అసలు మన్యం బిడ్డ ముస్లిం గా ఎందుకు మారాల్సి వచ్చింది అనే దానిమీద రాజమౌళి ఏం చూపించనున్నాడో కాని.. ప్రస్తుతం ఎన్టీఆర్ ముస్లిం పాత్రపై చాలా విమర్శలు, కొన్ని గాసిప్స్ సోషల్ మీడియాలో ప్రచారంలోకొచ్చాయి.
కొమరం భీం పాత్రధారి ఎన్టీఆర్ ముస్లిం యువకుడిగా నైజం అడ్డాలో చేరి అక్కడ నుండి తాను అనుకున్నది సాధించడమే ఈ ముస్లిం పాత్ర వెనుక ఉన్న ట్విస్ట్ అంటూ ప్రచారం మొదలైంది. మరి ఈ ప్రచారం లో నిజం ఎంతుందో కానీ... రాజమౌళి మాత్రం కొమరం భీం కి ముస్లిం గెటప్ ఎందుకు వేయించాడో అర్ధం కాక ఇప్పుడందరూ జుట్టు పీక్కుంటున్నారు. మరి రాజమౌళికి కావాల్సింది అదే, కథలోని ట్విస్ట్ ఎవరికి అర్ధం కాకుండా సస్పెన్స్ లో పెట్టడమే అని ఓ వర్గం ప్రేక్షకులు అంటున్న మాట.